పలు జిల్లాలో 30 నుంచి -40 కిలోమీటర్ల వేగంతో గాలులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా వరుణుడు చిరుజల్లులతో పలకరిస్తున్నాడు. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. అయితే రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం ఉత్తర కొంకణ్ పరిసర ప్రాంతాల నుంచి ఝార్ఖండ్ వరకు 1.5కిమీ ఎత్తు వద్ద ఉన్న ఉపరితల ద్రోణి బుధవారం బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది.
ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో
సిద్దిపేట, జనగామ, యాదాద్రి జిల్లాలతో పాటు ఖమ్మం, సంగారెడ్డి, నల్గొండ, మెదక్, సూర్యాపేట, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక నుంచి ఉత్తర మధ్య మహారాష్ట్ర వరకు ఉన్న ఉపరితల ద్రోణి నేడు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి రాయలసీమ, తెలంగాణ మీదుగా దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకు సగటు సముద్రమట్టం నుంచి 0.9కిమీ ఎత్తు వద్ద కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ సంచాలకులు తెలిపారు. అయితే గంటకు 30 నుంచి -40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.