హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో వాతావరణ శాఖ అధికారులు తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. శనివారం తెల్లవారుజామునుంచే హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం పడింది. చిక్కడపల్లి, హిమాయత్‌నగర్, అబిడ్స్, బాలాపూర్, బర్కత్‌పురా, కార్వాన్, సికింద్రాబాద్‌లో జల్లులు కురిశాయి.
తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నిజామాబాద్, సిద్దిపేట, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. పలుచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. నిజామాబాద్ జిల్లాలో భారీగా పంటనష్టం, పశువులు మృతి చెందగా, సిద్దిపేట, దుబ్బాకలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.