మనతెలంగాణ/హైదరాబాద్: ముసురు ముసుగులో తెలంగాణ వణుకుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆకాశంలో కారుమబ్బులు కమ్మకున్నాయి. ఒక వైపు ఈశాన్య భారంతం నుంచి వస్తున్న చలిగాలులతో ఉష్ణోగ్రతలు పడిపోయతున్నాయి. దిగువ స్థాయిలో చలిగాలులు తూర్పు అగ్నేయ దిశలనుండి రాష్ట్రంవైపు వీస్తున్నాయి.మరో వైపుమాండస్ తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు ముసురు పట్టికురుస్తున్నాయి.
ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. తుపాను తుంపర్లతో జనం ఇళ్లు విడిచి బయటకు వచ్చేందుకు జంకాల్సివస్తొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచే చిరుజల్లులు పడుతున్నాయి. హైదరాబాద్‌లో అత్యధికంగా 1.8మి.మి వర్షపాతం నమోదయింది. ఖమ్మంలో 0.5, మహబూబన్నగర్లో 0.2, దుండిగల్ , హకీంపేటలో 0.2మి.మి వంతున వర్షపాతం నమోదయింది.
పెరిగిన చలితీవ్రత
రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఆదివారం రాష్ట్రంలోని హనుమకొండలో అత్యల్పంగా 14డిగ్రీలకు పడిపోయింది. మెదక్‌లో 17డిగ్రీలు, హకీంపేటలో 18.9డిగ్రీలు, అదిలాబాద్‌లో 17.7డిగ్రీలు,హైదరాబాద్‌లో 19.2డిగ్రీలు, దుండిగల్‌లో 20డిగ్రీలు, నిజామాబాద్‌లో 20.5డిగ్రీలు, రామగుండంలో 20, నల్లగొండలో 17, మహబూబ్‌నగర్‌లో 21.5, ఖమ్మంలో 20.6, భద్రాచలంలో 24డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరో మూడు రోజులు వర్షాలే
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీనపడింది. ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒకమోస్తరు వర్షాలు కురిసినట్టు తెలిపింది. సోమవారం ఉరుములులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. అదే విధంగా రాగల మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.