Monday, December 23, 2024

ఇటు ఎండలు.. అటు వానలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:వేసవి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం 11దాటితే జనం ఇంటి నుంచి బయటకు వచ్చేందకు జంకుతున్నారు. మధ్యాహ్నం చేరేసరికి ప్రధాన నగరాల్లో రోడ్లు పలుచ బడుతున్నాయి. రాగల నాలుగు రోజులూ పగటి ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని , ఎండలు మరింత ముదురుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రత్యేకించి అదిలాబాద్, ఆసిఫాబాద్ , మంచిర్యాల ప్రాంతాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏప్రిల్ నెలలో వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు.

ఉష్ణోగ్రతలు కూడా గరిష్టంగా 45డిగ్రీలకు చేరుకునే అవకాశాలు ఉన్నట్టు తెలిపారు. శుక్రవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ..అత్యధికంగా అదిలాబాద్‌లో 39.8డిగ్రీలు రికార్డయింది. నిజామబాద్‌లో 39.4డిగ్రీలు నమోదయింది. మహబూబ్ నగర్‌లో 38.5డిగ్రీలు , మెదక్‌లో 38.2, రామగుండంలో 37.6,డిగ్రీలు నమోదయింది. గ్రేటర్ హైదరాబాద్‌లోనూ ఎండలు మండిపోయాయి. పగటి ఉష్ణోగ్రత 37.4డిగ్రీలకు పెరిగిపోయింది. ఈ వేసవి ప్రారంభమయ్యాక ఇంతగా ఉష్ణోగ్రత పెరగటంతో జనం వీధుల్లోకి వచ్చేందుకే జంకాల్సివచ్చింది. భద్రాచలంలో కూడా 37డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. నల్లగొండలో 36.5,ఖమ్మంలో 36.6, హన్మకొండలో 35 డిగ్రీలు నమోదయింది.
మరో మూడు రోజులు వర్షాలు :
రాష్ట్రంలో మిశ్రమ వాతావరణం నెలకుంది. ఒక వైపు ఎండుల మండిపోతుంటే మరో వైపు వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాష్ట్రంలోని పలు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. భద్రాచలంలో ఉన్నంటుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వర్షం దంచి కొట్టింది. పర్ణశాలలో బలమైన ఈదురు గాలులు వీచాయి. భద్రాచలం వరాహ నరసింహస్వామి ఆలయం ద్వజస్తంబంపై పిడుగు పడింది. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకూ సగటు సమద్రమట్టం నుంచి 1.5కి.మి ఎత్తున ద్రోణి కొనసాగుతోంది.

దీని ప్రభావంతో రాగల మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్కడక్కడ ఉరుములు ,మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. రాగల వారం రోజులకు వెదర్‌బులిటెన్ విడుదల చేసింది. అక్కడక్కడా తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు ఉన్నట్టు బిలిటెన్‌లో వివరించింది.అయితే జిల్లాల వారీగా ప్రత్యేక సూచనలేమి చేయలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News