మనతెలంగాణ/హైదరాబాద్ : పంటల సాగులో చీడపీడలను అరికట్టేందుకు వినియోగిస్తున్న పురుగు మందుల వాడకం పట్ల రైతుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.వి. ప్రవీణ్ రావు అన్నారు. బుధవారం విశ్వవిద్యాలయంలోని తన ఛాంబర్‌లో ప్రతిత అగ్రిసర్వీసెస్ సంస్థ రూపొందించిన ఈరైతు యాప్‌ను విసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రవీణ్ రావు మాట్లాడుతూ.. పురుగు మందుల సక్రమ వినియోగంపై రైతుల్లో సరైన అవగాహన లేకపోవడం వల్లనే వాటిని విచక్షణా రహితంగా ఉనియోస్తున్నారని అభిప్రాయపడ్డారు.
అదే సమయంలో రైతులకు సరైన సమాచారం సలహాలు, సూచనలు అందించే వ్యవస్థ లేకపోవడం వల్ల అనధికార వ్యవస్థల ద్వారా అందే సూచనలతో అవసరం లేని పురుగుమందుల వినియోగం అధికమైందన్నారు. ఈరైతు యాప్ ద్వారా అతి స్వల్పకాలంలోనే రైతులందరికీ సరైన సమాచారం అందాలని సూచించారు. యూనివర్శిటి యూట్యూబ్ ఛానల్‌కు కూడా రైతుల్లో ఆదరణ బాగా పెరిగిందన్నారు. సుమారు 50వేల మంది చందాదారులు , 50లక్షల మంది వీక్షకులు ఉన్నారని విసి డా.ప్రవీణ్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్శిటి పరిశోధనా సంచాలకులు డా.జగదీశ్వర్ ,సిపిఆర్‌వో వనోజు సుధాకర్‌తోపాటు ప్రతిమ అగ్రిసర్వీసెస్ ప్రతినిధులు పాల్గొన్నారు.