Saturday, December 21, 2024

పెరిగిన మెడికల్ సీట్లు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ వైద్య విద్యారంగంలో శతాబ్ద కాలంలో జరగని ఒక అద్భుత పరిణామాన్ని ఇటీవల బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆవిష్కరించింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం వల్ల తెలంగాణ ప్రజలకు ఎనలేని మేలు చేకూరిందనడానికి వైద్యవిద్యలో చోటు చేసుకున్న ఈ అద్భుత పరిణామం ప్రబల నిదర్శనం.అప్పుడే బడిలో అడుగుపెట్టి అ, ఆ లు దిద్దడం మొదలుపెట్టిన ఏ బిడ్డనైనా భవిష్యత్‌లో నువ్వేం అవుతావు? అని అడిగితే ఠక్కున వచ్చే ఒకే ఒక్క సమాధానం డాక్టర్.. “నేను డాక్టర్‌ను అవుతాను” అని. ఆ చిన్నారి కోరికను చూసి తల్లిదండ్రులు మురిసిపోతారు. కానీ, ఆ బిడ్డ పెరిగి పెద్దైన తర్వాత డాక్టర్ కోర్సులో అడ్మిషన్ అంత సులభం కాదనే విషయం అనుభవంలోకి వస్తుంది. కాలేజీలు తక్కువగా ఉండటం, ఉన్న కాలేజీల్లో తెలంగాణ విద్యార్థులకు ఇచ్చే సీట్లు తక్కువగా ఉండటం కారణంగా వైద్య విద్య గగనకుసుమంగా మారింది. దీంతో వారు తమ పిల్లన్ని మరే కోర్సులోనో చేర్పించి, రాజీపడక తప్పటంలేదు.

60 ఏండ్ల ఆంధ్రప్రదేశ్‌లో మన అనుభవం ఇదే. డాక్టర్ కావాలనే బలమైన కాంక్ష ఉండి, సర్దుబాటు చేసుకోలేక పోయినవారు మాత్రం తమకు ఉన్నదంతా అమ్మి, అప్పులు చేసి, కోట్లు పోసి మేనేజ్‌మెంట్ కోటాలో సీట్లు కొనుక్కోవాల్సి వస్తున్నది. లేదా తమ పిల్లల్ని ఎలాగైనా డాక్టర్ చదివించాలనే పట్టుదలతో ఏ చైనాకో, రష్యాకో, ఫిలిప్పైన్స్ దేశాలకో పంపిస్తున్నారు. పరదేశంలో చదువుకుంటున్న బిడ్డకు ఎప్పుడేం అవుతుందో? అని అనుక్షణం భయపడుతూ గడుపుతున్నారు. ఈ మధ్య ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం చెలరేగినపుడు అక్కడ వైద్యవిద్యను అభ్యసిస్తున్న తెలంగాణ విద్యార్థినీ, విద్యార్థుల గురించి వారి తల్లిదండ్రులు తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. వారిని స్వదేశానికి రప్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో కార్యాచరణ లేకపోయింది. ముఖ్యమంత్రి కెసిఆర్ హుటాహుటిన చర్యలు చేపట్టి, ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి ఉక్రెయిన్ లో వున్న తెలంగాణ వైద్య విద్యార్థులందరినీ భద్రంగా వెనక్కు తీసుకురాగలిగారు. అదే సమయంలో తెలంగాణ విద్యార్థులు వైద్య విద్యలో ప్రవేశం కోసం పడుతున్న పాట్లు తొలగిపోవాలని అందుకోసం సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ఆయన భావించారు. దానిని అనతికాలంలోనే సాధించారు.

తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం అనుక్షణం పరితపించే బిఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ విద్యార్థులు స్థానికంగా ఉంటూనే డాక్టర్ కల సాకారం చేసుకొనేందుకు గొప్ప అవకాశం కల్పించింది.ఎన్నో ఏండ్ల నుంచి వైద్య విద్యకు దూరమైన తెలంగాణ బిడ్డలకు నేడు ఊరట లభిస్తున్నది. సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న నిర్ణయాలు ఎంబిబిఎస్ చదువును ఎంతో దగ్గర చేశాయి. 2014 జూన్ 2 తర్వాత రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కాంపిటేటివ్ అథారిటీ (కన్వీనర్) కోటాలోని 100 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేయాలని బిఆర్‌ఎస్ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్‌కు సవరణ చేస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టం, ఆర్టికల్ 371డి నిబంధనలకు లోబడి అడ్మిషన్ రూల్స్‌కు సవరణ చేసింది.గతంలో కన్వీనర్ కోటాలో స్థానిక విద్యార్థులకు 85% మాత్రమే రిజర్వేషన్ ఉండేది. మిగతా 15% అన్‌రిజర్వుడ్ కేటగిరీ. ఇందులో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా పోటీపడేవారు. ఈ నిర్ణయం తో తెలంగాణ విద్యార్థులకు 520 మెడికల్ సీట్లు అదనంగా లభిస్తాయి. కొత్త మెడికల్ కాలేజీలలో 15% ఆలిండియా కోటా యథాతథంగా ఉంటుంది. ఇందులో తెలంగాణ, ఎపితో పాటు దేశంలో ఎక్కడి విద్యార్థులైనా మెరిట్ ప్రకారం అడ్మిషన్ పొందవచ్చు.

తెలంగాణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు చేరువ చేయడంతో పాటు రాష్ట్ర విద్యార్థులకు వైద్య విద్యను అందించేందుకు సిఎం కెసిఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభిస్తూ చరిత్ర సృష్టిస్తున్నారు. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇట్లా ఒకవైపు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూనే, సీట్లు తెలంగాణ విద్యార్థులకే ఎక్కువ దక్కేందుకు కొత్త కాలేజీలను ఏర్పాటు చేసింది, ప్రవేశాల నిబంధనల చట్టంలో మార్పు తీసుకొచ్చింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో కలిపి రాష్ట్రంలో మొత్తం 20 మెడికల్ కాలేజీలుండగా, వాటిలో కేవలం 2,850 ఎంబిబి ఎస్ సీట్లు మాత్రమే ఉండేవి. ఈ సీట్లలో కన్వీనర్ కోటా కింద 1,895 సీట్లు మాత్రమే ఉండేవి. ఇందులో అన్ రిజర్వుడు కోటాగా 15% సీట్లు అంటే… 280 సీట్లు కేటాయించాల్సి వచ్చేది. ఇందులో తెలంగాణ విద్యార్థులతో పాటు ఆంధ్రప్రదేశ్ వారు కూడా అవకాశం పొందేవారు. దీంతో తెలంగాణ విద్యార్థులు సీట్లు కోల్పోవాల్సి వచ్చేది. అయితే, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య 56 వరకు పెరిగింది. అంటే స్వరాష్ట్రంలో 36 కొత్త కాలేజీలు వచ్చాయి. సీట్ల సంఖ్య 8,340 వరకు పెరిగింది. పాత విధానమే కొనసాగితే, పెరిగిన మెడికల్ కాలేజీల్లో కూడా 15% అన్ రిజర్వుడ్ కోటా అమలు చేయాల్సి ఉంటుంది. దీంతో మరిన్ని సీట్లు తెలంగాణ విద్యార్థులు కోల్పోతారు. దీనిని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, అన్ రిజర్వుడ్ కోటాను కేవలం పాత 20 మెడికల్ కాలేజీలకు మాత్రమే పరిమితం చేస్తూ నిబంధనలకు సవరణ చేసింది. కొత్తగా వచ్చిన 36 మెడికల్ కాలేజీలకు ఆ నిబంధన వర్తించకుండా తాజా సవరణ చేసింది. దీంతో మరో 520 మెడికల్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు అదనంగా లభించనున్నాయి.

ఇప్పటికే ఎంబిబిఎస్ బి -కేటగిరీ సీట్లలో 85% సీట్లు తెలంగాణ విద్యార్థులకే చెందేలా లోకల్ రిజర్వ్ చేసుకున్నం. దీనివల్ల తెలంగాణ విద్యార్థులకు అదనంగా 1,300 ఎంబిబిఎస్ సీట్లు లభించాయి. తెలంగాణ సోయితో ఆలోచించిన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో కలిపి ఏటా తెలంగాణ విద్యార్థులకు మొత్తం 1,820 సీట్లు అదనంగా దక్కుతాయి. దీనిని సద్వినియోగం చేసుకొంటూ డాక్టర్ కావాలనే కలను విద్యార్థులు సాకారం చేసుకోవాలి. 2023-24లో దేశంలో అందుబాటులోకి వచ్చిన మొత్తం మెడికల్ సీట్లలో తెలంగాణలో అందుబాటులోకి వచ్చినవి 43 శాతం. దేశవ్యాప్తంగా 2,118 ఎంబిబిఎస్ సీట్లు రాగా, ఇందులో 900 సీట్లు రాష్ట్రంలో ఉన్నాయి. ఇట్లా పెరిగిన ఎంబిబిఎస్ సీట్లు సుమారు 20 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో సమానం. అయితే, మెడికల్ కాలేజీలు పెరిగిన కొద్దీ.. ఈ సీట్ల సంఖ్య మరింతగా పెరగనున్నది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత బిఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవసాయం, విద్యుత్తు, సాగునీరు, గ్రామీణాభివృద్ధి రంగాల్లో అద్భుతమైన పరివర్తన సాధించింది.దానికి కొనసాగింపుగా వైద్య విద్యలోనూ తెలంగాణను అగ్రగామిగా నిలిపింది. తెలంగాణలో ఎక్కువ మంది విద్యార్థులకు డాక్టర్లు అయ్యే విధంగా అవకాశాల్ని కల్పించింది. యావత్ ప్రపంచం ప్రశంసించేలా తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని మరింత ఉత్సాహంతో కొనసాగిస్తున్నది.

-గోపాల బాలరాజు
73370 82570

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News