ఉస్మానియాకెందుకు ఉలికిపాటు?
తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఉద్యమం సాగుతున్న కాలంలో ఉస్మానియా యూని వర్శిటీ విద్యార్థులు ధర్నాలు చేయకుండా, ఉద్యమాలు జరపకుండా, నినాదాలు ఇవ్వకుండా రాష్ట్రం వచ్చేదా? అలా విద్యా ర్థులు ప్రముఖ పాత్ర నిర్వహించి సాధించు కున్న రాష్ట్రంలో అదే యూనివర్శిటీలో విద్యార్థులను నినాదాలు ఇవ్వకూడదు, ఉద్యమాలు బంద్, ధర్నాలు నిషేధం అని చెప్పి యూనివర్శిటీ అధికార యంత్రాంగం ఇటీవల ఒక ఫత్వా జారీ చేసింది. హోలీ ముందు రోజు జారీ చేసిన ఈ ఫత్వాను పండగ సెలవు, ఆ తర్వాత శని, ఆదివారా లు పోతే సోమవారంనాటికి అందరూ మర్చిపోతారని అనుకున్నారు యూని వర్శిటీ అధికారులు. కానీ అలా జరగలేదు.
విద్యార్థులకు ఉండే సమస్యలు సామాజికమైనవే కాకుండా యూనివర్శిటీ లోపల విద్యాసం బంధిత సమస్యలు, పరిపాలనపర మైన సమస్యలు కూడా ఉంటాయి. వాటిని పరిష్కరించుకునే క్రమంలో ఆందోళన తప్ప మరో మార్గం ఉండదు. అలాంటిది వాళ్ళ కంట పడకుండా ఎక్కడో ఖాళీ స్థలాల్లో మీరు ఉద్యమాలు చేసుకోండని యూనివర్శిటీ యాజమాన్యం చెప్పడం హాస్యాస్పదం.
మెల్లిగా చెప్పినప్పుడు వినపడకపోతే గట్టిగా అరిచి చెప్పడమే నినాదం. స్వాతంత్య్రోద్య మ కాలంలో గట్టిగా అరిచి చెప్పినా వినప డటం లేదు కాబట్టి చెవిటి వాళ్లకు ఈ భాషలో చెప్తే అర్థమవుతుందని భగత్ సింగ్ బ్రిటిష్ సెంట్రల్ అసెంబ్లీలో బాంబు విసిరాడు. దాన్ని మనం నేరం అనం కదా. ఉస్మానియా యూనివర్శిటీలో నినాదాలు ఇవ్వడం నేరం ఎలా అవుతుంది, దాన్ని ఎలా నిషేధిస్తారు?
తెలంగాణ శాసనసభలో శుక్రవారంనాడు వార్షిక బడ్జెట్ మీద జరుగుతున్న చర్చ సందర్భంగా దేవరకొండ కాంగ్రెస్ శాసనసభ్యుడు బాలు నాయక్ మాట్లాడుతూ విద్యార్థుల బలిదానాలు చూసే సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని అన్నారు. అవును, తొలి దశ అయినా మలి దశ అయినా తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర, అందులో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల పాత్ర అనిర్వచనీయమైనది. వాళ్ల బలిదానాల కారణంగానే తెలంగాణ రాష్ట్ర సాధనకోసం జరిగిన పోరాటానికి అంత పెద్దయెత్తున ఆదరణ లభించింది. దేశాన్ని ఆకర్షించింది. చివరికి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రాష్ట్రాన్ని ఏర్పాటుచేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం సాగుతున్న కాలంలో ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు ధర్నాలు చేయకుండా, ఉద్యమాలు జరపకుండా, నినాదాలు ఇవ్వకుండా రాష్ట్రం వచ్చేదా? అలా విద్యార్థులు ప్రముఖ పాత్ర నిర్వహించి సాధించుకున్న రాష్ట్రంలో అదే యూనివర్శిటీలో విద్యార్థులను నినాదాలు ఇవ్వకూడదు, ఉద్యమాలు బంద్, ధర్నాలు నిషేధం అని చెప్పి యూనివర్శిటీ అధికార యంత్రాంగం ఇటీవల ఒక ఫత్వా జారీ చేసింది.
హోలీ ముందు రోజు జారీ చేసిన ఈ ఫత్వాను పండగ సెలవు, ఆ తర్వాత శని, ఆదివారాలు పోతే సోమవారంనాటికి అందరూ మర్చిపోతారని అనుకున్నారు యూనివర్శిటీ అధికారులు. కానీ అలా జరగలేదు. యూనివర్శిటీ ప్రస్తుత విద్యార్థులు, గతంలో అక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు కూడా దీనికి వ్యతిరేకంగా తీవ్రంగా స్పందించారు. దాంతో ఉస్మానియా యూనివర్శిటీ పాలకవర్గం ఒక రిజాయిండర్ జారీ చేసింది. రిజాయిండర్ అంటే అర్థం ఏమిటో ఉస్మానియా యూనివర్శిటీ అధికారవర్గం చెప్పాలి. మామూలుగా వార్తాపత్రికల పరిభాషలో అయితే ఒక వార్త ప్రచురించినప్పుడు అందులో అసత్యాలు, అర్థసత్యాలు, అభూత కల్పనలు ఉన్నట్టయితే అందువల్ల ఇబ్బందిపడిన వర్గాలు రాజకీయ నాయకులు కావచ్చు, ఇతరులు కావచ్చు, వారు జారీ చేసే వివరణను రిజాయిండర్ అంటారు. మరి ఉస్మానియా యూనివర్శిటీ అధికారం యంత్రాంగం తానే జారీ చేసిన సర్క్యులర్‌కు తానే రిజాయిండర్ జారీ చేయడం ఏమిటి? ఇది ఉస్మానియా యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ గారికి, రిజిస్ట్రార్ గారికి తెలియాలి. సరే, ఇటువంటి సరదా పొరపాట్లను పక్కన పెడితే సదరు రిజాయిండర్‌లో ‘అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ కార్యకలాపాలు సాగేచోట కాకుండా ఖాళీ స్థలాల్లో చేసుకోవచ్చు అన్నాం కానీ, అసలే చేయవద్దని అనలేదు’ అనే బలహీనమైన వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది.
ఏ తెలంగాణ విద్యార్థుల మీద, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థుల మీద ఆధారపడి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి రాష్ట్రాన్ని సాధించారో ఆ నాయకుడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తొలి రోజుల్లోనే నగరం నడిమధ్యలో ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌక్‌ను ఎత్తేసి శంషాబాద్ దగ్గర ఒక స్థలం కేటాయించి అక్కడ నిరసన తెలుపుకోండి అన్న విషయం గుర్తొస్తుంది ఉస్మానియా యూనివర్శిటీ అధికారులు తీరు చూస్తే. విద్యా విషయమైన వ్యవహారాలు సాగేచోట, పరిపాలన వ్యవహారాలు సాగేచోట నిరసనలు తెలుపకుండా, ఖాళీజాగాల్లో నిరసన తెలుపండి అనడం సమంజసమేనా?
విద్యార్థులకు ఉండే సమస్యలు సామాజికమైనవే కాకుండా యూనివర్శిటీ లోపల విద్యాసంబంధిత సమస్యలు, పరిపాలనపరమైన సమస్యలు కూడా ఉంటాయి. వాటిని పరిష్కరించుకునే క్రమంలో ఆందోళన తప్ప మరో మార్గం ఉండదు. అలాంటిది వాళ్ళ కంటపడకుండా ఎక్కడో ఖాళీ స్థలాల్లో మీరు ఉద్యమాలు చేసుకోండని యూనివర్శిటీ యాజమాన్యం చెప్పడం హాస్యాస్పదం. ధర్నా చౌక్‌ను ఊరవతలకి తరలించిన చంద్రశేఖరరావు కూడా ఒకప్పుడు ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థే. అక్కడ విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నవాడే. అంతెందుకు, తెలంగాణ తెచ్చుకున్న మలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించినప్పుడు ఆయన చేసిందేమిటి? ఇక్కడ ఒక విషయం గుర్తొస్తోంది.
కొన్ని మాసాల క్రితం ఇదే ఉస్మానియా యూనివర్శిటీ పూర్వ విద్యార్థి, భారతీయ జనతా పార్టీ జాతీయ రాజకీయాల్లో రాణించి గవర్నర్ గా పదవీ విరమణ చేసిన సిహెచ్ విద్యాసాగర్ రావు ఆత్మకథను ఆవిష్కరించిన సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళకి విద్యార్థి దశనుంచే వాటి గురించి అవగాహన ఉండడం, వాటిలో పాల్గొనడం అవసరం. లేకపోతే పార్టీలు ఫిరాయించే, రాజకీయాల్ని వ్యాపారాలకు వాడుకునే వాళ్ళు వచ్చి రాజకీయాలు కలుషితం అయిపోతాయ’ని చెప్పారు. తానే నియమించిన ప్రస్తుత ఉస్మానియా యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్‌ను ముఖ్యమంత్రి మళ్లీ పిలిచి విద్యాసాగర్ రావు గారి పుస్తకావిష్కరణ సభలో తాను మాట్లాడిన మాటలు ఆయనకు చెప్పి ఆ సర్క్యులర్ విరమింపజేసి విద్యార్థులను శాంతింప చేస్తే బాగుంటుంది.
శనివారంనాడు ఇదే అంశం మీద ఉస్మానియా యూనివర్శిటీ పూర్వ విద్యార్థులు నిర్వహించిన ఒక రౌండ్ టేండ్ సమావేశంలో నిర్వాహకుల్లో ఒకరు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ఉస్మానియా యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ మొదలుకొని రిజిస్ట్రార్ వరకు అందరూ దళితుల్లోని ఒక వర్గం నుండి వచ్చినవారు కాబట్టి వారిని ఇబ్బంది పెట్టడానికి ఇంకొక దళితవర్గాన్ని ఒక రాజకీయపక్షం రెచ్చగొడుతున్నట్లు యూనివర్శిటీ యాజమాన్యం భావిస్తోందని చెప్పారు. ఉన్నత విద్యావంతులు కావడానికి మతం, కులం, వర్గం అడ్డురావు. అవకాశాలు ఉండాలి. ఒక దళితుడు ఉస్మానియా యూనివర్శిటీ ఉపకులపతి కావడం అందరూ హర్షించాల్సిన విషయం. ఆ పదవి ఆయన విద్యార్హతల కారణంగా వచ్చింది. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వర్గంలోని ఎవరైనా ప్రభుత్వ రాజకీయ వ్యతిరేకవర్గాల చేతుల్లో పావులుగా మారి ఇటువంటి ఆందోళన చేయిస్తున్నారనే అభిప్రాయం బహుశా వైస్ ఛాన్స్‌లర్ లోనో, యాజమాన్యంలోనో ఉండవచ్చు. అటువంటిది ఏం జరిగినా సరే అందరూ ఖండించాల్సిందే.
అయితే దానికంటే ముందు యూనివర్శిటీ జారీచేసిన ఈ అసంబద్ధ సర్క్యులర్‌ని వెనక్కి తీసుకోవాలి. విద్యార్థులు ఆందోళనలు చేయవద్దు, వాళ్లకు రాజకీయాలు అక్కరలేదు, వాళ్ళు క్లాస్ రూముల్లో మాత్రమే ఉండాలి, చదువుకుని అమెరికా వంటి దేశాలకు వెళ్లి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లయి బాగా డబ్బు సంపాదించి సంపన్నులు కావాలి, సంపద సృష్టించాలి అనే వర్గం ఒకటి రాజకీయాల్లో కొంతకాలంగా బయలుదేరింది. 1980వ దశకంలో ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు రద్దు చేసారు. ఆ తర్వాత 1995లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు రాజకీయ పార్టీలకు విద్యార్థి విభాగాలు ఎందుకని చెప్పి, తన పార్టీలోని విద్యార్థి విభాగాన్ని రద్దు చేసుకున్నారు. అలాగే కార్మిక విభాగాన్ని కూడా రద్దు చేశారు. కొద్దిరోజుల్లోనే తత్వం బోధపడి చెంపలు వేసుకుని వాటిని పునరుద్ధరించారు. చరిత్ర చదువుకోవడం అవసరం లేదన్న చంద్రబాబు విద్యార్థి ఉద్యమాల చరిత్ర, కార్మిక ఉద్యమాల చరిత్ర ఒకసారి చదివితే అప్పట్లో ఆ పొరపాటు చేసి ఉండరు.
ఆ తర్వాత చెంపలు వేసుకుని ఉండరు. ఈ దేశంలో హేమాహేమీలైన రాజకీయ నాయకులంతా విద్యార్థుల ఉద్యమాల్లోంచి వచ్చినవాళ్లే. తలుపులు, కిటికీలు మూసుకుని, తరగతి గదిలో కూర్చుని చదువుకొని అందరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు అయి ఉంటే ఈ దేశానికి స్వాతంత్య్రం కూడా వచ్చి ఉండేది కాదు. స్వతంత్ర భారతానికి తొలి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ కూడా విద్యార్థి ఉద్యమాలతో మమేకమై, వాటి సహకారంతో స్వతంత్ర పోరాటం నడిపినవాడు. ఈ దేశానికి తొలి తెలుగు ప్రధానమంత్రి పివి నరసింహారావు, గొప్ప రాజకీయ పండితుడైన మన తెలుగువాడు సూదిని జైపాల్ రెడ్డి.. ఇలా లెక్కలు చెప్పుకుంటూపోతే అనేకమంది విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని యూనివర్శిటీల నుండి వచ్చి రాజకీయ నాయకులైనవాళ్ళే. వారిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన వాళ్ళు.. రాజకీయ మేధావి, సిపిఎం కేంద్ర కార్యదర్శిగా పనిచేసిన సీతారాం ఏచూరి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రిగా పనిచేసిన అరుణ్ జైట్లీ, లోకనాయక్ జయప్రకాశ్ నారాయణ, సంపూర్ణ క్రాంతి ఉద్యమంలో విద్యార్థిగా పాల్గొన్న ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, రాజస్థాన్ కాంగ్రెస్ నాయకుడు అశోక్ గెహ్లాట్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దగ్గర నుండి నిన్న మొన్నటి కన్హయాలాల్. అంతెందుకు, అస్సాంలో ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ (ఆసు) నాయకుడిగా విద్యార్థి ఉద్యమాన్ని నడిపి, ఎన్నికల్లో పోటీచేసి గెలిచి అతి చిన్నవయసులో యూనివర్శిటీ నుంచి నేరుగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి వెళ్ళిన వాడు ప్రఫుల్లకుమార్ మహంత.
ఉస్మానియా యూనివర్శిటీ యాజమాన్యం జారీ చేసిన ఈ వివాదాస్పదమైన లేదా హాస్యాస్పదమైన సర్కులర్లో అన్నిటికంటే ఎక్కువగా నవ్వించే విషయం ఒకటి.. నినాదాల మీద నిషేధం. నేరారోపణల మీద అరెస్టయి, కేసులు ఎదుర్కొంటూ జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నవాళ్లు చేతులకు సంకెళ్లతో కోర్టులకు వచ్చినప్పుడు కోర్టు ఆవరణలో నినాదాలు చేసిన సందర్భాలు అనేకం చూసాం. అంతకంటే పెద్ద నిర్బంధాన్ని ఉస్మానియా యూనివర్శిటీ యాజమాన్యం విద్యార్థుల మీద విధించదల్చుకున్నదా? మెల్లిగా చెప్పినప్పుడు వినపడకపోతే గట్టిగా అరిచి చెప్పడమే నినాదం.
స్వాతంత్య్రోద్యమ కాలంలో గట్టిగా అరిచి చెప్పినా వినపడటం లేదు కాబట్టి చెవిటి వాళ్లకు ఈ భాషలో చెప్తే అర్థమవుతుందని భగత్ సింగ్ బ్రిటిష్ సెంట్రల్ అసెంబ్లీలో బాంబు విసిరాడు. దాన్ని మనం నేరం అనం కదా. ఉస్మానియా యూనివర్శిటీలో నినాదాలు ఇవ్వడం నేరం ఎలా అవుతుంది, దాన్ని ఎలా నిషేధిస్తారు? ప్రజాస్వామ్యానికి అత్యంత అవసరమైన నిరసనను నిర్బంధించే ఉస్మానియా యూనివర్శిటీ యాజమాన్యం ఈ చర్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకొని వెంటనే విరమింప చేస్తారని ఆశిద్దాం. ప్రతిపక్షంలో ఉండగా ఆయన కూడా ఇటువంటి అనుభవాలు అనేకం చూసి ఉన్నారు కదా.