ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాదారులకూ వర్తింపు
వ్యవసాయ యోగ్యం కాని భూములపై ఈ నెల
16 నుంచి 20 వరకు సర్వే ఫిర్యాదుల
పరిష్కార బాధ్యత కలెక్టర్లకు అప్పగింత
‘రైతుభరోసా’ మార్గదర్శకాలు జారీ
మన తెలంగాణ / హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా మార్గదర్శకాలను ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది. ఈ నెల 26 నుంచే ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు ప్రకటింటింది. ఏడాదికి ఎకరాకు రూ. 12 వేల చొప్పున మొదటి విడతగా ఎకరాకు రూ. 6 వేల చొప్పున ఈ నెల 26 నుంచి రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయనున్నట్టు వెల్లడించింది. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది. అలాగే అటవీ భూముల్లో సాగుచేసుకుంటున్న పోడు భూములకు కూడా ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు.
మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి:
రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని ఎకరాకు 12 వేలు పెంచబడిందని పేర్కొన్నారు. భూ భారతి (ధరణి) పోర్టల్‌లో నమోదు అయిన వ్యవసాయయోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సహాయం అందించనున్నట్టు పేర్కొన్నారు. వ్యవసాయ యోగ్యం కానీ భూములను ఈ పథకం నుంచి తొలగిస్తారు. పోడు భూముల పట్టాలు కలిగిన వారికి కూడా రైతు భరోసాకు అర్హులని పేర్కొన్నారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించే డిబిటి పద్ధతిలో రైతు భరోసా సహాయం రైతుల ఖాతాలలో జమ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ రైతు భరోసా పథకాన్ని వ్యవసాయశాఖ సంచాలకులు అమలు చేస్తారని పేర్కొన్నారు. ఎన్‌ఐటి హైదరాబాద్ విభాగం ఈ పథకానికి ఐటీ భాగస్వామిగా బాధ్యతలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. అలాగే జిల్లాల్లో కలెక్టర్లు ఈ పథకం అమలు, ఫిర్యాదుల పరిష్కారానికి బాధ్యులుగా ఉంటారని పేర్కొన్నారు.
16 నుంచి 20 వరకు సర్వే
వ్యవసాయ యోగ్యం కానీ కొండలు, గుట్టలు, ఫామ్ హౌస్‌లు, రోడ్లు, భూ సేకరణ కింద పోయిన భూములు, నాలా కన్వర్షన్ అయిన భూములు, లే అవుట్లుగా మారిన వెంచర్లను ఈ నెల 16 నుంచి 20 వరకు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిందిగా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ సర్వే ఆధారంగానే వ్యవసాయోగ్యమైన భూములను గుర్తించి రైతు భరోసాను అమలు చేయనున్నారు.