రాజ్‌నాథ్ థాకరే హెచ్చరికలు
ముంబై : మజీదులలో మైక్‌ల ద్వారా నమాజ్ పఠనం మరోసారి వివాదానికి దారితీసింది. ఈ లౌడ్‌స్పీకర్‌లను మసీదు కమిటీలు వెంటనే తీసివేయాలి, లేకపోతే అన్ని దేవాలయాలలో పోటీగా మైక్‌ల ద్వారా హనుమాన్ చాలీసా, ఇతర భక్తి గీతాలను విన్పించడం జరుగుతుందని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎన్‌ఎస్) అధినేత రాజ్ థాకరే స్పష్టం చేశారు. ముస్లింల రంజాన్ నెల వచ్చే నెల 3తో ముగుస్తుంది. అప్పటి వరకూ చూస్తాం. ఇదే చివరి గడువు అనుకోండి. తరువాత కూడా మసీదులపై మైక్‌లు తీసివేయకపోతే తమ కార్యాచరణ ప్రత్యక్షంగా ఉంటుందని హెచ్చరించారు. ముస్లిం సోదరుల మత ప్రార్థనలను వారి వ్యక్తిగత విషయాలను తాము వ్యతిరేకించడం లేదని, మైక్‌లతో కలిగే సామాజిక ఇబ్బందిని ప్రస్తావిస్తున్నామని తెలిపారు. దేశంలో మతసామరస్యం దెబ్బతినరాదనేదే తమ ఉద్ధేశమని స్పష్టం చేశారు. జూన్ ఐదున తాను ఇతర కార్యకర్తలతో కలిసి అయోధ్యను సందర్శిస్తానని తెలిపారు. ఎందుకు? అని విలేకరులు ప్రశ్నించగా తాను ముంబై వదిలి వెళ్లక చాలారోజులు అయిందని, ఏదో మార్పుగా ఈ పర్యటన పెట్టుకున్నానని అని అనుకోండని చమత్కరించారు.