బిజెపి అభ్యర్థి రాజా ఇక్బాల్ సింగ్ శుక్రవారం ఢిల్లీ కొత్త మేయర్‌గా ఎన్నికయ్యారు. దీనితో రెండు సంవత్సరాల తరువాత కాషాయ పార్టీ మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసిడి)లో అధికారంలోకి తిరిగి వచ్చింది. ఇక్బాల్ సింగ్ కాంగ్రెస్ అభ్యర్థి మన్‌దీప్ సింగ్‌ను 125 వోట్ల ఆధిక్యంతో ఓడించి మేయర్ పదవి సాధించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మేయర్ ఎన్నికను బహిష్కరించింది. మేయర్ ఎన్నిక ఫలితం ప్రకటించిన తరువాత డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నికల రెండవ రౌండ్ చోటు చేసుకోవలసి ఉంది. అయితే, కాంగ్రెస్ అభ్యర్థిని అరిబా ఖాన్ తన నామినేషన్ ఉపసంహరించుకోగా బిజెపికి చెందిన జై భగవాన్ యాదవ్ డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇక్బాల్ సింగ్ తన మేయర్ పీఠంలో ఆసీనుడు అవుతుండగా, బిజెపి కౌన్సిలర్లు ‘భారత్ మాతాకీజై’ అని నినదించారు. మేయర్ పదవికి 142 వోట్లు పోల్ కాగా ఒక వోటును చెల్లనిదిగా ప్రకటించారు. ఇక్బాల్‌కు 133 వోట్లు, కాంగ్రెస్ అభ్యర్థి మన్‌దీప్ సింగ్‌కు ఎనిమిది వోట్లు లభించాయి. ఎంపి మనోజ్ తివారీ గైర్‌హాజర్ కారణంగా బిజెపి రెండు వోట్లు కోల్పోయింది. మేయర్ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు ఆప్ సోమవారమే ప్రకటించింది. ఎంసిడి సాధారణ సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించారు. ఇక్బాల్ మేయర్‌గా ఎన్నిక కాగానే స్టాండింగ్ కమిటీని ఒక నెలలోగా ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.