Wednesday, January 22, 2025

పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు స్ఫూర్తినిచ్చింది సూర్య: రాజమౌళి

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ’కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ’కంగువ’ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ’కంగువ’ సినిమా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ’కంగువ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి మాట్లాడుతూ “తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయకుండా మిగతా ప్రాంతాలకు తీసుకెళ్లాలని నాకు ప్రేరణ కలిగించిన హీరో సూర్య. గజినీ సినిమా టైమ్‌లో సూర్య తన సినిమాలను తెలుగులో ప్రమోట్ చేసుకోవడం, తెలుగు ప్రేక్షకుల దగ్గరకు చేర్చడానికి చేసిన ప్రయత్నాన్ని కేస్ స్టడీగా నా ప్రొడ్యూసర్స్, హీరోలకు చెబుతుండేవాడిని. తెలుగు ప్రజల ప్రేమను సూర్య ఎలా పొందాడో, మనం కూడా తమిళ ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజల ప్రేమను పొందాలని చెబుతుండేవాడిని. నేను పాన్ ఇండియా మూవీస్ చేసేందుకు స్ఫూర్తినిచ్చింది సూర్యనే. సూర్య, నేను గతంలో ఓ సినిమా చేయాలనుకున్నాం. కుదరలేదు. సూర్య ఒక ఫంక్షన్‌లో చెప్పాడు అతను నాతో సినిమా చేయడాన్ని మిస్ అయ్యానని, కానీ సూర్యతో సినిమా చేసే అవకాశం నేను మిస్ అయ్యాను.

సూర్య ఫిలింమేకర్స్ కంటే గొప్ప స్టోరీస్‌ను ఎంపిక చేసుకుని జర్నీ చేస్తున్నాడు. కంగువ లాంటి సినిమాను థియేటర్స్ లోనే చూడాలి. అప్పుడే ఆ సినిమాటిక్ అనుభూతిని పొందుతారు. ఈనెల 14న కంగువను థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి”అని అన్నారు. డైరెక్టర్ శివ మాట్లాడుతూ “కంగువ సినిమా విజువల్ ఫీస్ట్ లా ఉంటుంది. వెయ్యేళ్ల కిందటి కథలో ఐదు తెగల మధ్య అనుబంధాలు, ప్రేమలు, ప్రతీకారం, పోరాటం వంటివన్నీ రా అండ్ రస్టిక్ గా జెన్యూన్‌గా రూపొందించాం. కంగువ తప్పకుండా ఒక గొప్ప సినిమాటిక్ అనుభూతిస్తుంది”అని పేర్కొన్నారు.

నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ వండర్‌ఫుల్ మూవీ కంగువని థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నానని అన్నారు. హీరో సూర్య మాట్లాడుతూ “కంగువ నాకు మర్చిపోలేని అనుభూతి ఇచ్చిన సినిమా. ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డా. ప్రతిరోజూ మూడు వేల మంది సెట్‌లో పనిచేసేవారు. ముగ్గురు నలుగురు అసిస్టెంట్ డైరెక్టర్స్ తో శివ వీళ్లందరితో వర్క్ చేయించుకునేవారు. కంగువలో నటించాక నేను వ్యక్తిగతంగా మరింత పరిణితి చెందాను. కంగువ వంటి స్పెషల్ మూవీ మాకు ఇచ్చినందుకు శివకు థ్యాంక్స్ చెబుతున్నా. ఇది ఎవర్ గ్రీన్ సినిమాగా అందరి మనసుల్లో నిలిచిపోతుందని నమ్ముతున్నాను”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజు, అల్లు అరవింద్, వివేక్ కూఛిబొట్ల, డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్‌తో పాటు శశి, అభినేష్ , రాకేందు మౌళి, వెట్రి పళనిస్వామి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News