హైదరాబాద్: గోషామహల్ బిజెపి ఎంఎల్‌ఏ టి.రాజాసింగ్ ప్రవక్త ముహమ్మద్(స)పై గత ఏడాది చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ సస్పెన్షన్‌లోనే ఉన్నారు. కాగా ఇతర స్థానిక నాయకులు ఆయన నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం. రాజాసింగ్ రాష్ట్రంలో ర్యాలీలు, ప్రజా సమావేశాలు నిర్వహించకుండా తెలంగాణ హైకోర్టు సైతం ఉత్తర్వులు జారీచేసింది.
మరో ఆరు నెలల్లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు జరుగనున్నాయి. రాజాసింగ్ కొన్ని వారాల కిందట వేరే రాష్ట్రమైన మహారాష్ట్రలో హిందూత్వ ర్యాలీల్లో పాల్గొన్నారు. రెండుసార్లు గోషామహల్ ఎంఎల్‌ఏగా ఎన్నికైన ఆయన అంబర్‌పేట్ నియోజకవర్గం నుంచైనా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయాలన్న ఆసక్తితో ఉన్నారు. అంబర్‌పేట్ నియోజకవర్గం ఇదివరలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డిది. గోషామహల్ లేక అంబర్‌పేట్ సీట్లలో ఎక్కడి నుంచైనా 2023లో గెలుస్తానన్న ధీమా రాజాసింగ్‌కు ఇప్పటికీ ఉంది. బెయిల్‌పై బయట ఉన్న ఆయన ఎలాంటి రెచ్చగొట్టే ప్రజా ప్రసంగాలు చేయకూడదన్న ఆంక్షలు ఉన్నాయి. ముంబయిలో విద్వేష ప్రసంగం చేసినందుకు ఆయనకు పోలీసులు జనవరి 29న నోటీసులు కూడా ఇచ్చారు. ఆయనపై మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో కేసుంది. రాజాసింగ్‌ది లోధ్ క్షత్రియ కులం. ఆయన కులం నుంచే ఇద్దరు టికెట్ ఇస్తే గోషామహల్ నుంచి పోటీచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు బిజెపి గుర్తించింది. అయితే తమ సమూహంలో ఎలాంటి ఘర్షణలు ఏర్పడకుండా ఉండాలని ఆ కులం పెద్దలు భావిస్తున్నారు.