Friday, December 20, 2024

కన్నీళ్లు, కష్టాలు దిగమింగాను.. సోనియాకి రాజగోపాల్ రెడ్డి లేఖ

- Advertisement -
- Advertisement -

కన్నీళ్లు, కష్టాలు దిగమింగాను
జైలుకెళ్లొచ్చిన వ్యక్తి కింద పని చేయలేను
సోనియాకి రాజగోపాల్ రెడ్డి లేఖ
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మునుగోడు ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం లేఖ రాశారు. కాంగ్రెస్ ద్వారా ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మరో రాజకీయ పోరాటం చేయాలని లేఖలో కోమటిరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని కొందరు నిర్వీర్యం చేశారని ఎంఎల్‌ఎలను గెలిపించలేని వ్యక్తులు, గెలిచిన ఎంఎల్‌ఎలలో మనోధైర్యం నింపలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. జైలు పాలైన వ్యక్తి ఆధ్వర్యంలో తాను కలిసి పనిచేయలేనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. అనేక పార్టీలు మారి స్వలాభం కోసం ఓ ప్రజాప్రతినిధి చేయకూడని పనులు చేశారని ఆయన ఆరోపించారు. మీపైనే వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించారని, ఇది తనను తీవ్రంగా బాధించిందని రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి విధేయులైన వారిని అడుగడుగునా అవమానపరుస్తున్నారని స్పష్టం చేశారు. మీ నాయకత్వంలో ఏ పని అప్పగించినా రాజీ లేకుండా కష్టపడ్డానని గుర్తుచేశారు. కన్నీళ్లు, కష్టాలు దిగమింగుకుంటూ పార్టీలో పనిచేశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచిన ఎంఎల్‌ఎ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాని, దీనిని తక్షణం ఆమోదించాలని రాజగోపాల్ రెడ్డి కోరారు.

కాగా… మునుగోడు ఎంఎల్‌ఎ పదవికి, కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించిన సంగతి విదితమే. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని త్వరలోనే కలిసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా పత్రాన్ని కూడా అందిస్తానని కూడా రాజగోపాల్ రెడ్డి మంగళవారం నాడు ప్రకటించారు. కొన్ని రోజులుగా నియోజకవర్గంలో ముఖ్య నేతలతో రాజగోపాల్ రెడ్డి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు హైద్రాబాద్ లో రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సమయంలో కూడా కొందరు నేతలు ఆయనతో పాటే సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగితే తమ పట్టును నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ తరుణంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైపునకు పార్టీ కార్యకర్తలు వెళ్లకుండా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనుంది. ఆయా మండలాల్లో పర్యటిస్తూ నేతల అభిప్రాయాలను సేకరించనున్నారు.

Rajagopal Reddy resign letter to Sonia Gandhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News