Monday, January 20, 2025

ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా.. కాంగ్రెస్‌కీ గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

Rajagopal Reddy Resign quit from Congress

మన తెలంగాణ/హైదరాబాద్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేశారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామాతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని కోరుకుంటున్నానని చెప్పారు. త్వరలో స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ ఇస్తానని తెలిపారు. మునుగోడు ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు. రాజీనామా అంశంతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలపై రాజగోపాల్‌రెడ్డి పరోక్షంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 20 ఏళ్లు కాంగ్రెస్‌ను తిట్టిన వ్యక్తి చెప్తే ఇప్పుడు తాము వినాలా అంటూ అక్కసును వెళ్లగక్కారు. కాంగ్రెస్‌లో ఉండి తెలంగాణ కోసం పోరాడిన వాళ్లకు గౌరవం ఉండొద్దా? అని నిలదీశారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్న వాళ్లకు పదవులు దక్కలేదని వాపోయారు. రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా తాను ఎప్పుడూ మాట్లడలేదన్న రాజగోపాల్‌రెడ్డి కమిటీల ఏర్పాటులో సీనియర్ నేతలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. బయటి నుంచి వచ్చిన వ్యక్తికి సీఎం పదవి కూడా ఇస్తారా? అని కాంగ్రెస్ అధిష్ఠానానికి ప్రశ్నలు సంధించారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. తన రాజీనామాపై తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోందన్నారు. తానంటే గిట్టనివారు సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్, టీవీ ఇంటర్వ్యూలలో తప్పుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజీనామాపైనా చర్చ పక్కదారి పట్టిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా పోడు భూముల సమస్య వుందని.. అసెంబ్లీ సాక్షిగా ఈ విషయంపై ఎంతోమంది మాట్లాడారని ఆయన గుర్తుచేశారు. అటవీ శాఖ అధికారులు పోడు భూముల్లో ఫెన్సింగ్ వేసి గిరిజనులను వ్యవసాయం చేసుకోనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన మూడేళ్లుగా తన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. పెన్షన్, రేషన్ కార్డులు, లక్ష రుణమాఫీ, ఇళ్ల నిర్మాణం, నిరుద్యోగ భృతి ఇలా ఏ ఒక్క విషయంలోనూ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడం లేదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షనేతలను గౌరవించాలనే ఇంగిత జ్ఞానం ఈ ప్రభుత్వానికి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భట్టి విక్రమార్క సిఎల్‌పి నేతగా వుంటే ఒర్వలేకపోయారని మండిపడ్డారు. 12 మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు టిఆర్‌ఎస్‌లోకి వెళ్లటం తప్పు. వారిని తీసుకోవటం కూడా తప్పేనని అన్నారు. సామాన్య పేద కుటుంబాల్లో సంతోషం లేదన్నారు. ’తెలంగాణ వచ్చాక ఫలితాలు కొద్దిమంది మాత్రమే అనుభవిస్తున్నారు.

అప్పుల కారణంగా తెలంగాణలో శ్రీలంక తరహా పరిస్థితులు వచ్చినా రావొచ్చు. నా నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఎంత చూసినా.. అవీ ఫలించలేదు.’ అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తన రాజీనామాపై కొన్ని రోజులుగా ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. మునుగోడులో ఉపఎన్నిక జరిగితే మునుగోడులో ప్రజలకు మేలు జరుగుతుం దన్నారు. ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని మునుగోడు ప్రజలే నిర్ణయిస్తారన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ అంటే గౌరవం ఉందన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అరాచక పాలనకు చరమగీతం పాడటం బిజెపికి మాత్రమే సాధ్యమన్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం బలహీనపడటంతో ఏమీ చేయలేకపోయామన్నారు. రాజీనామా చేస్తే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుం టుందని తెలిపారు. తన మునుగోడు నియోజకవర్గంలో కొందరికైనా మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రజల కోసమే ఉన్నారన్నారు.

Rajagopal Reddy Resign quit from Congress

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News