మనుగోడు: మనుగోడు ఉప ఎన్నికల సందర్భంగా బిజెపి అభ్యర్థి కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి తన కిరాయి గుండాలతో ఆరెగూడెం ప్రజలపై దాడి చేయించిన ఘటనను ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. గ్రామస్తులపై దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. వార్త కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టుపై దాడి చేయడం దారుణమైన విషయమని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ఓటు వేసిన పాపానికి ప్రజలపై తిరగబడడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండా గిరి చేస్తున్న బిజెపి అభ్యర్థికి గుణపాఠం తప్పదని హరీష్ రావు హెచ్చరించారు.
కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఏనాడూ తమ గ్రామానికి రాని రాజ్ గోపాల్ రెడ్డి ఇప్పుడు ఎందుకు వచ్చారంటూ ప్రజలు నిలదీయడంతో ఆగ్రహంతో ఊగిపోయి ప్రజలపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ నిర్ణయించిన ఎన్నికల ప్రచారం సమయం ముగిసిన తర్వాత ఆరెగూడెంలో ప్రచారం చేయడంతో బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై అక్కడి ప్రజలు తిరగబడ్డారన్నారు. దీంతో ఆగ్రహానికి లోనైన రాజగోపాల్ రెడ్డి వర్గీయులు ప్రజలపై దాడి చేయడం మొదలుపెట్టారని వివరించారు. బిజెపి నాయకులు చేసిన ఈ దాడిలో టిఆర్ఎస్ నాయకులతో గ్రామస్థులు, జర్నలిస్టు గాయపడ్డాడని పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి కార్లలో కట్టెలు, రాళ్లు తీసుకొచ్చి అంకిరెడ్డిగూడెం గ్రామంలో టిఆర్ఎస్ కార్యకర్తలు, పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి అరాచకం సృష్టించడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులకు కర్రు కాల్చి వాత పెట్టే విధంగా ప్రజలు గుణపాఠం చెబుతారని మంత్రి అన్నారు.