అమరావతి: మాయమాటలతో ప్రేమ పేరిట నమ్మించి మోసం చేయడంతో ఓ యువతి మత్తు మందు ఇంజక్షన్ శరీరంలోకి ఎక్కించుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమహేంద్రవరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ రైతుకు వివాహం జరిగిన 11 ఏళ్ల తరువాత ఆడపిల్ల జన్మించడంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఓ పార్మసీ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతూ ఓ ఆస్పత్రిలో ఫార్మసిస్టుగా పార్ట్‌టైమ్ జాబ్ చేస్తోంది.
పని చేసే వద్ద దీపక్ పరిచయమయ్యాడు. మాయ మాటలతో యువతిని ప్రేమలోకి దించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో అసభ్య చిత్రాలు బయటపెడుతానని బెదిరించడంతో ఆదివారం మత్తు మందు ఇంజక్షన్ శరీరంలోకి ఎక్కించుకుంది. వెంటనే ఆస్పత్రి సిబ్బంది గమనించి ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దరాయప్తు చేస్తున్నామని ఎఎస్‌పి సుబ్బరాజు, డిఎస్‌పి రమేష్ బాబు తెలిపారు.