Monday, December 23, 2024

నెహ్రూ విధానాలపై హెచ్చరించిన రాజాజీ

- Advertisement -
- Advertisement -

1913లో రాజగోపాలాచారి గాంధీజీ జైలు అనుభవాన్ని తన స్వంత ఖర్చుతో కరపత్రంగా ముద్రించారు. 1919లో రాజగోపాలాచారి గాంధీని తొలిసారిగా మద్రాసులో (ప్రస్తుతం చెన్నై) కలిశారు. గాంధీ సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. 1920లో వేలూరులో రెండేళ్లు జైలు శిక్ష కూడా అనుభవించారు. విడుదలైన తర్వాత గాంధీ ప్రవచించిన హిందూ -ముస్లిం సామరస్యం, అంటరానితనం నిర్మూలన సూత్రాలను ప్రచారం చేయడానికి తన స్వంత ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఖాదీ గురించి కూడా ప్రచారం చేశారు. 1930లో ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడానికి గాంధీ దండి మార్చ్‌కు నాయకత్వం వహించినప్పుడు, రాజగోపాలాచారి మద్రాసు ప్రెసిడెన్సీలోని వేదారణ్యంలో ఇదే విధమైన పాదయాత్రను నిర్వహించారు.

రాజాజీగా ప్రసిద్ధి చెందిన చక్రవర్తి రాజగోపాలాచారి స్వతంత్ర భారత దేశపు మొదటి, చివరి భారత గవర్నర్ జనరల్. స్వతంత్ర ఉద్యమంలో, కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పాల్గొన్న, మహాత్మా గాంధీకి అనుచరుడైన ఆయన ఆధునిక భారతదేశంలో మహోన్నత వ్యక్తిత్వం గల నేత. మద్రాసు ప్రెసిడెన్సీ ప్రీమియర్ గా, పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా, కేంద్ర హోం మంత్రిగా, మద్రాసు ముఖ్యమంత్రిగా పలు పదవులకు వన్నెతెచ్చిన ఆయన నెహ్రూ ఆర్ధిక, రాజకీయ విధానాలను తప్పుబట్టి, దేశంలో కమ్యూనిస్టు రాజకీయాలను సైద్ధాంతికంగా ఎదుర్కొని, ప్రత్యామ్నాయ ఆర్ధిక, సామాజిక విధానాలతో స్వతంత్ర పార్టీని స్థాపించారు.

భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న పొందిన మొదటి గ్రహీతలలో ఒకరు. నేడు దేశం అమలు పరుస్తున్న ఆర్ధిక సంస్కరణలను 50వ దశకంలోనే ప్రతిపాదించిన దూరదృష్టి గల నేత. మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు సన్నిహితుడైనప్పటికీ, దేశ స్వాతంత్య్రం అనంతరం ఆయన అనుసరిస్తున్న విధానాలు భారత దేశానికి ప్రమాదకారి అని హెచ్చరించిన మొదటి నేత. అంతేకాదు, కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి నెహ్రూ ఆధారిత కాంగ్రెస్ విధానాలు, కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ప్రత్యామ్నాయ రాజకీయ విలువలు, విధానాలను ప్రోత్సహించారు. అందులో భాగంగా స్వతంత్ర పార్టీ ఏర్పాటులో కీలక భూమిక వహించారు. చాలా త్వరితగతిన ఆ పార్టీ దేశ వ్యాప్తంగా వ్యాపించి కాంగ్రెస్‌ను ప్రజా క్షేత్రంతో నిలదీయడం ప్రారంభించింది.

ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా, ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వం కేరళలో కన్నా చాలా ముందుగానే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కమ్యూనిస్టులు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టడం కోసం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి, అయిష్టంగానే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 1878 డిసెంబరు 10న మద్రాసులోని బ్రిటీష్ ప్రెసిడెన్సీలో చక్రవర్తి వెంకటార్యా అయ్యంగార్, సింగారమ్మ అయ్యంగార్ దంపతులకు జన్మించిన రాజగోపాలాచారి ప్రెసిడెన్సీ కళాశాలలో న్యాయ విద్యను పూర్తి చేశారు. సేలంలో న్యాయవాదిగా వృత్తి చేపట్టిన సమయంలో దక్షిణాఫ్రికాలో శాసనోల్లంఘన ఆలోచనలను ప్రకటించే ఒక న్యాయవాది మహాత్మా గాంధీ గురించి తెలుసుకున్నారు.

1913లో రాజగోపాలాచారి గాంధీజీ జైలు అనుభవాన్ని తన స్వంత ఖర్చుతో కరపత్రంగా ముద్రించారు. 1919లో రాజగోపాలాచారి గాంధీని తొలిసారిగా మద్రాసులో (ప్రస్తుతం చెన్నై) కలిశారు. గాంధీ సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. 1920లో వేలూరులో రెండేళ్లు జైలు శిక్ష కూడా అనుభవించారు. విడుదలైన తర్వాత గాంధీ ప్రవచించిన హిందూ -ముస్లిం సామరస్యం, అంటరానితనం నిర్మూలన సూత్రాలను ప్రచారం చేయడానికి తన స్వంత ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఖాదీ గురించి కూడా ప్రచారం చేశారు. 1930లో ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడానికి గాంధీ దండి మార్చ్‌కు నాయకత్వం వహించినప్పుడు, రాజగోపాలాచారి మద్రాసు ప్రెసిడెన్సీలోని వేదారణ్యంలో ఇదే విధమైన పాదయాత్రను నిర్వహించారు. గాంధీ వార్తాపత్రిక యంగ్ ఇండియాకు సంపాదకుడుగా కూడా వ్యవహరించారు.

రాజగోపాలాచారి ఎన్నడూ తన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి భయపడలేదు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో రాజగోపాలాచారి గాంధీని కూడా వ్యతిరేకించారు. చివరికి బ్రిటీష్ వారు దేశం విడిచి వెళ్లబోతున్నారని, అందుకే మరో సత్యాగ్రహాన్ని ప్రారంభించడం మంచి నిర్ణయం కాదని ఆయన స్పష్టం చేశారు. హిందూ, ముస్లింల మధ్య విభేదాలకు స్వస్తి పలికేందుకు సంప్రదింపులు జరపాలని సూచించారు. 1916లో తమిళ్ సైంటిఫిక్ టెర్మ్ సొసైటీని స్థాపించారు. ఇది రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణితం, ఖగోళ శాస్త్రం, జీవశాస్త్రాలలోని శాస్త్రీయ పదాలను సాధారణ తమిళ పదాలలోకి అనువదించే సంస్థ. ఆయన రాసిన రామాయణం తమిళ్ అనువాదం విశేష ప్రాచుర్యం పొందింది. దానిని చక్రవర్తి తిరుమగన్‌గా ప్రచురించారు.

ఈ పుస్తకానికి 1958లో తమిళ భాషలో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన సరళమైన భాషలో అందరికీ అర్ధం అయ్యే విధంగా రామాయణ, మహాభారత గ్రంధాలను ఆంగ్లంలో రాసారు. 1937లో మద్రాసు ప్రెసిడెన్సీకి మొదటి ప్రధాన మంత్రిగా ఎన్నికవడంతో ఆయన రాజకీయ జీవనం ప్రారంభమైనది. 1939లో రాజగోపాలాచారి అంటరానితనం, కుల దురభిమానాల ను నిషేధించారు. ఆ మేరకు మద్రాసు ఆలయ ప్రవేశ అధికారం, నష్టపరిహారం చట్టాన్ని తీసుకు వచ్చారు. భారత దేశంలో దళితులకు ఆలయ ప్రవేశం కల్పించడం, వారి అభ్యున్నతికి ప్రభుత్వ పరంగా చర్యలు చేపట్టడంలో ఆద్యుడని చెప్పవచ్చు. ఈ చట్టం ప్రకారం దళితులను దేవాలయాల్లోకి అనుమతించారు.

అయితే బ్రిటన్ జర్మనీపై యుద్ధం ప్రకటించినందుకు నిరసనగా 1940లో ఆ పదవికి రాజీనామా చేశారు. స్వాతంత్య్రానికి ముందు కేంద్రం లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో పరిశ్రమలు, విద్య, ఆర్ధిక, సరఫరాల మంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమితులయ్యారు. 1947లో లార్డ్ మౌంట్ బాటన్ లేనప్పుడు, చివరి బ్రిటీష్ వైస్రాయ్, స్వతంత్ర భారత దేశం మొదటి గవర్నర్ జనరల్‌గా రాజగోపాలాచారి తాత్కాలికంగా ఎంపికయ్యారు. జూన్ 1948లో మౌంట్ బాటన్ భారత దేశాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నందున రాజగోపాలాచారికి 26 జనవరి, 1950 వరకు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చే వరకు ఆ పదవిలో ఉన్నారు.

తదనంతరం ఆయన రాజకీయాల నుండి విరమించుకోవాలని అనుకున్నారు. అయితే మద్రాసు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌కు మెజారిటీ రాకపోవడం సుమారు 60 మంది సభ్యులను గెల్చుకున్న సిపిఐ కొందరు స్వతంత్రులు, ఇతర పార్టీలతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధమైనప్పుడు నాడు కృషికార్ లోక్‌పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆచార్యరంగా ప్రోద్బలంతో రాజాజీ ఏప్రిల్ 10, 1952న ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాజగోపాలాచారి విద్యా వ్యవస్థను సంస్కరించడంలో, సమాజంలో మార్పులు తీసుకురావడంలో చురుకుగా పాల్గొన్నారు. తమిళ పాఠశాలల్లో హిందీని తప్పనిసరి భాషగా కూడా చేశారు. అందుకు వ్యతిరేకంగా నిరసనలకు దారితీయడంతో ఆయన ఏప్రిల్ 13, 1954న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

1959లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి స్వతంత్ర పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీ 1962, 1967, 1971 ఎన్నికలలో కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్న ప్రధాన ప్రతిపక్షాలలో ఒకటిగా ఉంది. మద్రాసులో సిఎన్ అన్నాదురై నాయకత్వంలో ఆయన ఏర్పాటు చేసిన సంకీర్ణ కూటమి 1967 ఎన్నికలలో కాంగ్రెస్‌ను ఓడించి అధికారం చేపట్టింది. అప్పటి నుండి తమిళనాడులో తిరిగి కాంగ్రెస్ సొంతంగా అధికారం చేపట్టలేకపోయింది. ఆయన సామాజిక సంప్రదాయవాది అయితే స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక వ్యవస్థను సమర్థించారు. అవినీతికి మూలమైన ‘లైసెన్స్- పర్మిట్ -రాజ్’ పోవాలని స్పష్టం చేశారు. గాంధీవలె, సమాజంలో మతం ప్రాముఖ్యతను విశ్వసించారు. నిష్ణాతుడైన రచయిత. ఆంగ్లంలో అనేక ప్రసిద్ధ గ్రంధాలను రాసారు. స్వరాజ్య పత్రికను ఏర్పాటు చేసి సంపాదకునిగా వ్యవహరించారు. కర్ణాటక సంగీతానికి సెట్ చేసిన కురై ఒన్రుమ్ ఇల్లై పాట కూర్పుతో కూడా ఘనత పొందారు. 1955లో రాజగోపాలాచారి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించారు. ఆయన డిసెంబర్ 25, 1972 న మరణించారు.

చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News