ముంబై: దర్శకుడు రాజమౌళి తీసిని ‘బాహుబలి’ సినిమా పెద్ద హిట్టయిన సంగతే అందరికీ తెలుసు. కానీ ఆ సినిమా రూపొందించడానికి చేసిన అప్పు, పడ్డ కష్టాలు ఎవరికీ తెలియవని ఆ సినిమాలో నటించిన నటుడు రానా దగ్గుబాటి ఇటీవల తెలిపారు. బాహుబలి సినిమాను నిర్మించడానికి దాదాపు రూ. 400 కోట్లు అప్పు తెచ్చారని ఆయన అన్నారు.
రానా ఇటీవల ఓ ఈవెంట్‌లో తమ ప్రాజెక్టుకు నిర్మాతలు ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పారు. సినిమా నిర్మించడం కోసం నిర్మాతలు చేసే అప్పుకు అత్యధిక వడ్డీ రేట్లు ఇస్తుంటారని అన్నారు. ‘మూడు నాలుగేళ్ల క్రితం సినిమాలు తీయడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చేది? అది నిర్మాతలు తమ ఇల్లు లేక ఆస్తులు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి తెచ్చేవాళ్లు. అది కూడా వడ్డీకి తెచ్చేవారు. మేము దాదాపు 24 నుంచి 28 శాతం వడ్డీ చెల్లిస్తాము. అలా సినిమాలకు అప్పు చేస్తాము. బాహుబలి సినిమాకు ఆ వడ్డీ రేటుకే రూ. 300 నుంచి 400 కోట్ల అప్పు తెచ్చారు’ అని రానా ‘ఇండియా టుడే’ పత్రికకు తెలిపారు.
బాహుబలి1కి ఐదున్నర సంవత్సరాల వ్యవధికి 24 శాతం వడ్డీపై రూ. 180 కోట్లు తెచ్చారు. ‘మొదటి భాగంకు చాలా కష్టపడ్డాము. తెలుగులో ఆ సినిమా సంపాదించిన దానికి రెట్టింపు వ్యయం మేము చేశాము. అప్పు చేసిన దానికి, రాబడికి పొంతనే కుదరలేదు. బహుబలి2ని కూడా మేము అప్పట్లో కొంత తీశాము. ఒకవేళ ఫస్ట్ పార్ట్ బాగా ఆడి ఉండకపోతే, ఏమి జరిగి ఉండేదో నాకైతే ఊహించలేను’ అన్నారు.
నిర్మాతలు ఎదుర్కొన్న సవాళ్లను రానా దగ్గుబాటి వివరించారు. ‘ఆశయాన్ని సాధించడంలో, అద్భుతమైన చిత్రీకరణకు రిస్క్‌లు, త్యాగాలు అవసరమవుతాయి’ అని ఆ సినిమా తెలిపిందన్నారు.