డిసెంబర్ 12… సూపర్ స్టార్ రజనీకాంత్ బర్త్ డే. 74వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన తలైవా రజనీ వయసు పెరిగినా, వెండితెరపై మాత్రం ఆయన నవ యువకుడే. నవ మన్మధుడే. ఆసియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా రికార్డు సృష్టించిన రజనీ జీవితం తెరచిన పుస్తకం. ఆయన జీవిత విశేషాలు అందరికీ తెలిసినవే. నిరాడంబరమైన జీవితం గడిపే రజనీ, తనపై తనే జోకులు వేసుకుంటూ ఉంటారు. అలా ఆయన తనపై ఒక జోక్ ను ఒక టెలివిజన్ షోలో స్వయంగా చెప్పారు. వేదికపైనే ఉన్న అమితాబ్ పడీపడీ నవ్వారు.
ఆ జోక్ ఏంటంటే… ఒకసారి బెంగళూరులో తన సోదరుడి ఇంటికి రజనీ వెళ్ళారట. ఇంటి ఎదురుగా ఉన్న వాళ్లు రజనీని చూసేందుకు వచ్చారట. అందులో ఒక వ్యక్తి రజనీని ‘ఇప్పుడు ఏం సినిమా చేస్తున్నారు సర్’ అని అడిగితే రజనీ ‘రోబో అనే సినిమా చేస్తున్నాను. అందులో ఐశ్వర్యా రాయ్ హీరోయిన్’ అని చెప్పారట. అందుకు ఆ వ్యక్తి ‘మరి, హీరో ఎవరు సార్?’ అని అడిగారట. ఇది రజనీ చెప్పిన జోక్ అయితే, తమ అభిమాన హీరో రజనీపై ఫ్యాన్స్ పేల్చిన జోకులు కూడా ఉన్నాయి. అవేమిటో మీరే చూడండి…
- రజనీ గుడ్ మార్నింగ్ చెప్పందే సూర్యుడు ఉదయించడు.
- రజనీ కేలండర్లో ఏప్రిల్ 1 ఉండదు. ఎందుకంటే రజనీని ఫూల్ చేసేవాడు ఇంకా పుట్టలేదు మరి.
- రజనీకాంత్ క్రికెట్ ఆడుతుంటే, ఆ రోజు కురవాల్సిన వర్షం కూడా వాయిదా పడుతుంది.
- రజనీ నటించిన రోబో సినిమాను దేవుడు చూసి, ‘ఓ మై రజనీకాంత్’ అనుకున్నాడట.
- తన విజిటింగ్ కార్డును ఉపయోగించి ఏటిఎం నుంచి డబ్బులు డ్రా చేయగల ఒకే ఒక్కడు- రజనీ.
- దేవుడు నీళ్లపై నడగలవడేమో, కానీ రజనీ నేలపైనే ఈదగలడు.
- రజనీ ఇండియాలో ఉంటున్నందుకు, భారతదేశం ఆయనకు పన్ను కడుతోంది.
- ఒకసారి రజనీ హెలికాప్టర్లో వెళ్తుంటే, ఆయన పర్సు జారి పడిపోయింది. ఆ పడిపోయిన ప్రదేశాన్నే ఇప్పుడు అందరూ స్విస్ బ్యాంక్ అని అంటున్నారు.
- ఒకసారి రజనీ సూర్యుణ్ని చూసి కన్నెర్ర చేస్తే, సూర్యుడు భయపడి చంద్రుడి వెనకాల దాక్కున్నాడు. అదే సూర్యగ్రహణం!
- ఒకసారి రజనీ కౌన్ బనేగా కరోడ్ పతి హాట్ సీట్లో కూర్చున్నాడు. దాంతో ఆయనను ఏ ప్రశ్నఅడగాలో తెలియక కంప్యూటరే లైఫ్ లైన్ తీసుకుందట.
- ఒకసారి ఒక జపాన్ కుర్రాడికి రజనీ జోక్ చెప్పాడు. ఆ కుర్రాడు అప్పటినుంచీ నవ్వుతూనే ఉన్నాడు. అతనే లాఫింగ్ బుద్ధ!
- ఒకసారి రజనీకాంత్ బాల్కనీలో నించుని ఉన్నాడు. ఆయన చేతిలో ఉన్న నాణెం జారి కిందపడిపోయింది. రజనీ కిందకు వెళ్లి చూస్తే, నాణెం కనిపించలేదు. ఎందుకో తెలుసా? నాణెం కిందపడేలోగానే రజనీ కిందకు వచ్చేశాడు మరి.
- ఉల్లిపాయను కోస్తే అందరికీ కన్నీళ్లు వస్తాయి. కానీ రజనీ కోస్తే, ఉల్లిపాయకే కన్నీళ్లు వస్తాయి.
- రజనీ చేతుల మీదుగా హార్వర్డ్ యూనివర్శిటీ డాక్టరేట్ పట్టా అందుకుంది.
- రజనీ షూటింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు చంద్రుడిలో నల్లటి మచ్చలు ఏర్పడ్డాయి.
- రజనీకాంత్ ఒకసారి ఒక వ్యక్తిని తన్నితే, వెళ్లి చంద్రుడిపై పడ్డాడట. అతనే చంద్రునిపై కాలు పెట్టిన మొదటి వ్యక్తి!
- అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్ ను కనుక్కునే సమయానికే, రజనీకాంత్ నుంచి ఆయనకు మూడు మిస్స్ డ్ కాల్స్ వచ్చాయట.
- రజనీ ఈ మధ్య క్రికెట్ ఆడటం మానేశాడు. ఎందుకంటే డిఫెన్స్ ఆడినా.. బాల్ వెళ్లి చంద్రమండలంలో పడుతోంది మరి.