Friday, January 10, 2025

మాల్దీవులకు ఫరారయిన లంకేశ్వరుడు రాజపక్సా

- Advertisement -
- Advertisement -

Rajapaksa fled to the Maldives

తాత్కాలిక అధ్యక్షులుగా ప్రధానికి పగ్గాలు
దేశం ఫాసిస్టులపాలవుతోందనే హెచ్చరికలు
అమలులోకి వచ్చిన ఎమర్జెన్సీ
సైనికాధికారులతో కమిటీ ఏర్పాటు
పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు చర్యలు
కొన్ని ప్రాంతాలలో కఠిన స్థాయి కర్ఫ్యూ

కొలంబో : ప్రజల తిరుగుబాటు ఫలితంగా శ్రీలంక దిగ్బంధపు దేశాధ్యక్షులు గొటబాయ రాజపక్సా సైనిక విమానం ఎఎన్ 32లో బుధవారం మాల్దీవులకు కు ఫరారు అయ్యారు. అక్కడి నుంచి ఆయన సింగపూర్‌కు వెళ్లుతారని వెల్లడైంది. పదవి నుంచి దిగిపోవడానికి కొద్ది గంటల ముందు ఆయన దేశం వీడి వెళ్లినట్లు నిర్థారణ అయింది. దేశ ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించడంలో విఫలమయ్యారనే జనాగ్రహం వెల్లువెత్తడం, కొలంబోలోని అధ్యక్ష భవనంలోకి ప్రజలు చొరబడటం వంటి పరిణామాల నడుమ రాజపక్సా ఫరారు అయ్యారు. మాల్దీవులకు చేరుకోగానే 73 సంవత్సరాల రాజపక్సా తన వారసుడిగా దేశ తాత్కాలిక అధ్యక్షులుగా ప్రధాని రనీల్ విక్రమ్‌సింఘేను నియమించినట్లు వర్తమానం వెలువరించారు. ఇటువంటి అసాధారణ పరిస్థితుల నడుమ దేశ ప్రధాని దేశాధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించే వీలుందని రాజ్యాంగంలోని ఆర్టికల్ 37(1) చెపుతోందని తమ ప్రకటనలో రాజపక్సా వివరించారు. దేశాధ్యక్షులు దేశంలో లేనప్పుడు లేదా జబ్బుపడ్డప్పుడు ప్రధాని ఈ బాధ్యతలు తీసుకునే విధంగా నిబంధనలు నిర్ధేశిస్తున్నాయని వెల్లడించారు.

ఆయన విదేశాలలో ఉన్నంతవరకూ ప్రధాని దేశాధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వర్తిస్తారని పార్లమెంట్ స్పీకర్ మహీంద యప అబెవర్దెన తెలిపారు. తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రెసిడెంట్ తనకు ఫోన్‌లో చెప్పినట్లు స్పీకర్ వివరించారు. రాజపక్సా మధ్యాహ్నం 3 గంటలకు మాల్దీవుల రాజధాని మాలేకు చేరుకున్నారని బిబిసి తెలిపింది. మాల్దీవుల ప్రభుత్వ ప్రతినిధి ఒకరుఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారని, తరువాత ఆయనను వెంట ఉన్న13 మందిని కొందరిని పేరు వెల్లడించని ఓ ప్రాంతానికి తరలించారు. మాల్దీవుల స్పీకర్ , మాల్దీవుల మాజీ అధ్యక్షులు మహమద్ నషీద్‌లు రాజపక్సా మాల్దీవుల ప్రవేశానికి దౌత్యం చేపట్టినట్లు, ప్రభుత్వాన్ని ఒప్పించినట్లు వెల్లడైంది. దేశ పార్లమెంట్‌కు తెలియచేయకుండానే ఆయనను ఇక్కడికి రప్పించారని దీనిపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయని మాల్దీవుల అధికారులు కొందరు తెలిపారు. ముందు తెలియచేయకుండా ఆయనను ఇక్కడికి అనుమతించడం అనుచితం అని మాల్దీవ్స్ నేషనల్ పార్టీ (ఎంఎన్‌పి) విమర్శించింది. శ్రీలంక ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా ఆ దేశాధ్యక్షుడికి ఇక్కడ ఆశ్రయం ఇవ్వడం ఎందుకు అని పార్టీ నేత , దేశ మాజీ విదేశాంగ మంత్రి దున్యా మౌమూన్ స్పందించారు.

లంకలో అత్యయిక పరిస్థితి
ప్రకటించిన ప్రధాని విక్రమసింఘే
పరిస్థితి అదుపునకు సైన్యానికి ఆదేశాలు
సాయుధ బలగాలకు సంపూర్ణాధికారాలు

దేశంలో పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రధాని విక్రమసింఘే బుధవారం అత్యయిక పరిస్థితిని ప్రకటించారు. పరిస్థితి చక్కబడే వరకూ ఈ ఎమర్జెన్సీ అమలులో ఉంటుందని తెలిపారు. దేశంలోని పశ్చిమ ప్రాంతంలో కర్ఫూ విధిస్తున్నట్లు, శాంతి భద్రతల స్థితిని తిరిగి సాధారణం చేసేందుకు సైనిక దళాల ఉన్నతాధికారులు అన్ని చర్యలూ తీసుకోవాలని ఆదేశించారు. జాతిని ఉద్ధేశించి ఆయన బుధవారం టీవీలలో ప్రసంగించారు. దేశం అరాచకవాదుల చేతిలోకి వెళ్లకుండా చేసేందుకు సైనికాధికారులు అవసరం అయిన చర్యలూతీసుకోవాలని ప్రధాని , ఇప్పుడు తాత్కాలిక దేశాధ్యక్షులు కూడా అయిన సింఘే సూచించారు. ఫాసిస్టులను పూర్తి స్థాయిలో అణచివేయాల్సి ఉందన్నారు. నిరసనలుఅదుపు తప్పి ఇప్పుడు మరో రూపానికి దారితీస్తున్నందున వెంటనే దీనిని చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఫాసిస్టులు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే, గందరగోళం సృష్టిస్తే దేశం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ఎమర్జెన్సీ, కర్పూలు ఖచ్చితంగా అమలుపర్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సాయుధ బలగాల అధినేతలతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు అయిందని, రాజకీయ జోక్యం ఎటువంటి స్థాయిలోనూ లేకుండా ఈ కమిటీ సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయాల్సి ఉంటుందని తెలిపారు. దేశంలో సాధారణ పరిస్థితిని తీసుకువచ్చేందుకు అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే తాము దేశ ప్రధానిగా వైదొలుగుతానని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News