కొలంబో : శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స స్వదేశానికి తిరిగి వచ్చే హక్కు ఉందని, అయితే నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఆయన తప్పనిసరిగా విచారణ ఎదుర్కోవాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాగి జన బలవేగయ డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఆయనకు చట్టపరమైన మినహాయింపులు లేవని గుర్తు చేసింది. శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభం లో కూరుకుపోవడంతో దేశాన్ని విడిచి వెళ్లి పోయిన గొటబాయ ఈ వారం తిరిగి రానున్నట్టు ఆయన కుటుంబ సభ్యుడొకరు వెల్లడించిన సంగతి తెలిసిందే. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఆయనను విచారించాలి. తన తల్లిదండ్రుల స్మారక చిహ్నం కోసం రాష్ట్ర నిధులను ఖర్చు చేశారనే ఆరోపణలో ఆయనపై కేసు ఉంది. ప్రస్తుతం ఆయనకు చట్టపరమైన మినహాయింపులు లేనందున ఆయనను విచారించ వచ్చు. దోషిగా తేలితే జరిమానా విధించ వచ్చుఅని ఎస్‌జేబీ నేత అజిత్ పి పెరీరా వ్యాఖ్యానించినట్టు ఓ వార్తా సంస్థ తెలిపింది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత్ అందించిన ఒక బిలియన్ డాలర్ల రుణ సౌకర్యాన్ని రాజపక్స ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు.