Monday, December 23, 2024

బ్యాంకాక్‌లో రాజపక్స… హోటల్‌లోనే మకాం

- Advertisement -
- Advertisement -

Rajapaksa staying at Bangkok hotel

బయటకు రావద్దంటూ పోలీసుల సూచన

బ్యాంకాక్: భద్రతా కారణాల రీత్యా లోపలే ఉండాలని, బయట తిరగవద్దని థాయ్‌ల్యాండ్ రాజధాని బ్యాంకాక్ నడిబొడ్డున ఉన్న ఒక స్టార్ హోటల్‌లో బసచేసిన పదవీచ్యుత శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు పోలీసులు సూచించినట్లు శుక్రవారం ఇక్కడ పత్రికా కథనాలు వెలువడ్డాయి. గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో సింగపూర్ నుంచి ఒక ప్రత్యేక విమానంలో ముగ్గురు వ్యక్తులతో కలసి రాజపక్స వచ్చారని బ్యాంకాక్ పోస్ట్ వార్తాపత్రిక తెలిపింది. తొలుత ఫుకెట్‌కు వెళ్లాలనుకున్న రాజపక్స బృందం అక్కడ దిగితే వెంటనే సమాచారం బయటపడుతుందన్న కారణంతో బ్యాంకాక్‌లోని డాన్ మువాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోనే ఉన్న సైనిక విమానాశ్రయంలో ప్రత్యేక విమానంలో దిగారని పత్రిక తెలిపింది. రాజపక్స బస చేసిన హోటల్ వెలుపల స్పెషల్ బ్రాంచ్ బ్యూరో పోలీసులు సాధారణ దుస్తులలో నిఘా పెట్టారని పత్రిక పేర్కొంది. సింగపూర్ వీసా గడువు తీరిపోవడంతో తాత్కాలిక బస నిమిత్తం రాజపక్స బ్యాంకాక్ చేరుకున్నారు. వేరే దేశంలో శాశ్వత ఆశ్రయం లభించే వరకు ఆయన ఇక్కడే ఉండే అవకాశం ఉందని పత్రిక పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News