ప్రధాని కార్యాలయం వెల్లడి
కొలంబో : చిక్కుల్లో పడ్డ శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స జులై 13 న రాజీనామా చేయనున్నట్టు ప్రధాని రణిల్ విక్రమసింఘేకు అధికారికంగా తెలియజేసినట్టు ప్రధాన మంత్రి కార్యాలయం సోమవారం వెల్లడించింది. నిరసనకారులు అధ్యక్ష , ప్రధాని అధికారిక నివాస భవనాల్లోకి దూసుకెళ్లి శనివారం నుంచి అక్కడే ఉంటూ ఆందోళనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. రాజపక్స రాజీనామాకు ఇష్టంగానే ఉన్నారని, అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తారని ప్రధాని విక్రమసింఘే పేర్కొన్నారు.
అధ్యక్ష పదవి నుంచి రాజపక్స, ప్రధాని పదవి నుంచి విక్రమ సింఘే తప్పుకున్న తరువాత అన్ని పార్టీలతో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, తరువాత ఎన్నికలకు వెళ్లాలని విపక్షాలు ఆదివారం చర్చలు జరిపాయి. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక, శనివారం కొలంబో లోని రాజపక్స అధికారిక నివాసం లోకి నిరసన కారులు చొచ్చుకుని వెళ్లడం
అల్లకల్లోలమైన రోజుకు సాక్షంగా పేర్కొంటున్నారు. నిరసనకారులు అధ్యక్షుని నివాసంలోని బెడ్‌రూమ్‌ల్లో విశ్రమించడం, స్విమ్మింగ్‌పూల్‌లో విచ్చలవిడిగా ఈతకొట్టడం కనిపించింది.
అఖిలపక్ష తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడగానే కేబినెట్ రాజీనామా : విక్రమ సింఘే
కొత్తగా అఖిలపక్ష తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కేబినెట్ మొత్తం రాజీనామా చేస్తుందని ప్రధాని విక్రమసింఘే సోమవారం వెల్లడించారు. శనివారం రాజపక్స తాను బుధవారం రాజీనామా చేస్తానని ప్రకటించారు. ప్రధాని విక్రమసింఘే కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తాను కూడా పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే కేబినెట్ సభ్యులంతా తమ బాధ్యతలను కొత్త ప్రభుత్వానికి అప్పగించడానికి అంగీకరించారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు మంత్రులతో ప్రధాని విక్రమసింఘే సోమవారం ఉదయం చర్చలు జరిపారు. సోమవారం తరువాత పార్లమెంట్ స్పీకర్‌తో అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటు విషయం చర్చిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఐదుగురు మంత్రులు తమ రాజీనామాలు ప్రకటించారు. పార్టీ నేతల అభ్యర్థన మేరకు రాజపక్సా రాజీనామాకు అంగీకరించారు. అయితే అధ్యక్షుడు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు, ప్రధాని ఇద్దరూ రాజీనామాలు చేస్తే పార్లమెంట్ స్పీకర్ తాత్కాలిక అధ్యక్షునిగా గరిష్ఠంగా 30 రోజుల వరకు పదవిని నిర్వహించవచ్చు. ఈ 30 రోజుల్లో పార్లమెంట్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవలసి ఉంటుంది. మిగతా రెండేళ్ల కాలం ఆయనే అధ్యక్షుడిగా పాలన సాగిస్తారు.
కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధం : ప్రధాన ప్రతిపక్షం ఎస్‌జెబి
ఆర్థిక, రాజకీయ సంక్షోభం లో ఇరుక్కుని అన్ని విధాలా దివాలా తీసిన శ్రీలంక దేశంలో సుస్థిరత సాధించడానికి కొత్త ప్రభుత్వాన్ని తాము నడపడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రధాన ప్రతిపక్షం సమాగి జనబలవేగయ (ఎస్‌జెబి) సోమవారం వెల్లడించింది. అన్నిపార్టీలతో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడగానే ప్రస్తుత కేబినెట్ రాజీనామా చేసి ఆయా బాధ్యతలను కొత్త ప్రభుత్వానికి అప్పగిస్తుందని ప్రధాని విక్రమసింఘే కార్యాలయం ప్రకటించిన తరువాత ఎస్‌జెబి నేత సజిథ్ ప్రేమదాస నుంచి ప్రకటన వీడియో ద్వారా వెలువడింది. ఎస్‌సిబి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రేమదాస తాము అధ్యక్షుడు, ప్రధాని స్థాయిల్లో దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అధ్యక్షుడు, ప్రధాని ఆధ్వర్యంలో తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని , దీనికన్నా వేరే ప్రత్యామ్నాయం ఏదీ లేదని వివరించారు. దీన్ని ఎవరైనా వ్యతిరేకించినా లేదా వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నించినా “నమ్మకద్రోహం” గా పరిగణిస్తామని స్పష్టం చేశారు. మాతృదేశానికి సరైన నాయకత్వం అందించి మాతృభూమిని రక్షిస్తామన్నారు. అధ్యక్షుడు రాజపక్సను వెళ్లగొట్టడానికి ప్రజలు చేపట్టిన నిరసనలను ప్రేమదాస గుర్తించారు. ఇది మాతృభూమికి అందించిన విజయమని , ప్రజావిజయమని, సంఘర్షణపై గెలుపని వ్యాఖ్యానించారు.