శ్రీలంక మంత్రి ఆశాభావం
కొలంబో: శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పరారీలో లేరని, ఆయన సింగపూర్ నుంచి స్వదేశానికి తిరిగివచ్చే అవకాశం ఉందని క్యాబినెట్ ప్రతినిధి బందుల గుణవర్దెన మంగళవారం వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేశారన్న ఆగ్రహంతో ఈ నెల 9వ తేదీన ప్రజలు అధ్యక్షుని భవనాన్ని ముట్టడించిన దరిమిలా దేశాన్ని విడిచిపెట్టిన 73 ఏళ్ల రాజపక్స జులై 13న మాల్దీవులకు..మరుసటి రోజు అక్కడి నుంచి సింగపూర్‌కు పయనమయ్యారు. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో రాజపక్స గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు రవాణా, హైవేలు, మాస్ మీడియా శాఖల మంత్రి కూడా అయిన గుణవర్దెన సమాధానమిస్తూ మాజీ అధ్యక్షుడు పరారీలో లేరని, ఆయన సింగపూర్ నుంచి తిరిగిరావచ్చని చెప్పారు. రాజపక్స దేశాన్ని వదిలి పారిపోయారని, ఆయన ఎక్కడో తలదాచుకున్నారని అంటే తాను నమ్మబోనని కూడా గుణవర్దెన చెప్పారు. ఇలా ఉండగా..జులై 14న వ్యక్తిగత పర్యటనపై సింగపూర్ చేరుకున్న రాజపక్సకు 14 రోజుల స్వల్పకాలిక వీసాను అక్కడి ప్రభుత్వం మంజూరు చేసింది. తనకు ఆశ్రయం కల్పించాలని రాజపక్స కోరలేదని, అదే విధంగా ఆయనకు తమ ప్రభుత్వం ఎటువంటి ఆశ్రయం కల్పించలేదని సింగపూర్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి ఇటీవల ప్రకటించారు.