మనతెలంగాణ/ హైదరాబాద్ : ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారం మా అంతర్గత విషయం, సస్పెన్స్ ఎత్తివేస్తే ఆయన పోటీలో ఉంటారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. గురువారం మీడియా అడిగిన ప్రశ్నకు కిషన్ రెడ్డి సమాధానమిస్తూ.. ఆ అంశం అధిష్టానం పరిధిలో ఉందని, సస్పెన్షన్ ఎత్తివేస్తే టికెట్ గురించి ఆలోచిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా ఎన్నికల షెడ్యూల్ రావడంతో రాజాసింగ్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనేతల ద్వారా సస్పెన్షన్ ఎత్తివేత కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. తాను సెక్యులర్ పార్టీల్లో చేరబోనని, కమలం గుర్తుపైనే పోటీ చేస్తానని, తన సస్పెన్షన్ ఎత్తివేస్తారనే నమ్మకం తనకు ఉందని రాజాసింగ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ టికెట్ రాని పక్షంలో రాజకీయాలకు దూరంగా ఉంటానని, ఇతర పార్టీల తరఫున పోటీ చేయబోనని అంటున్నారు.
జెపి నడ్డా నివాసంలో కీలక సమావేశం..
నవంబర్ 30న జరగనున్న శాసనసభ ఎన్నికలపై చర్చించేందుకు రాష్ట్ర బిజెపి నేతలు ఢిల్లీలోని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో సమావేశమయ్యారు. ఈ కీలక సమావేశానికి భేటీకి నడ్డాతో పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్, ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ, తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జీలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, ప్రకాష్ జావదేకర్ హాజరయ్యారు. అభ్యర్థుల జాబితాతో పాటుగా ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యుహాలపై కూడా ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. తొలి జాబితాలో 20మంది బిసిలకు చోటు దక్కే అవకాశం ఉంది. సస్పెషన్ కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. ఈ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ బిజెపి టికెట్ రేసులో ఉన్నారు. ఆయన ఇప్పటికే ఓటర్లను కలుస్తూ.. సేవా కార్యక్రమాల్లో తలమునుకలయ్యారు. టికెట్ తనకే దక్కుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
బిజెపికి సవాలుగా బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మేనిఫెస్టులు..
అధికార బిఆర్‌ఎస్,కాంగ్రెస్‌లు తమ అభ్యర్థుల ప్రకటనలు, దశల వారీ జాబితాలతో పట్టు సాధిస్తూ వారిని రేసులో ముందంజలో ఉన్నాయి. బిఆర్‌ఎస్ తమ అభ్యర్థులను వెల్లడించడంతో, కాంగ్రెస్ తన దశల వారీ జాబితా,ప్రజలకు ఆరు హామీలతో ముందంజలో ఉంది. రాష్ట్ర రాజకీయాలను ఈ రెండు ప్రముఖ పార్టీల మధ్య హోరాహోరీగా మార్చింది. ఈ తరుణంలోది బిజెపి వ్యూహంపై పరిశీలకులకు ఆసక్తిని కనబరుస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక,మేనిఫెస్టో రూపకల్పనపై మల్లగుల్లాలు పడుతున్న బిజెపి మొదటి నుంచి ఎన్నికల రేసులో వెనుకబడింది.పార్టీ తన మొదటి అభ్యర్థుల జాబితాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే మేనిఫెస్టోను రూపొందించడంలో సవాళ్లను ఎదుర్కొంటోంది.
కాంగ్రెస్, బిఆర్‌ఎస్ రెండూ ఇప్పటికే వివిధ వర్గాల సంక్షేమం కోసం వాగ్దానాలు ప్రకటించాయి,వీటిలో పెన్షన్లు,రైతు బంధు వంటి పథకాలు ఉన్నాయి, గ్యాస్ సిలిండర్ రేట్లను తగ్గించడం,ఏకీకృత మేనిఫెస్టోను రూపొందించడం బిజెపికి సవాలుగా మారింది. ఉచిత పథకాలకు వ్యతిరేకంగా వారి వైఖరి, కాంగ్రెస్, బిఆర్‌ఎస్ చేసిన వాగ్దానాలకు విరుద్ధంగా ఉండటం బిజెపికి ముఖ్యమైన అడ్డంకులలో ఒకటి. వారి భావజాలం సంక్షేమ ప్రతిపాదనలతో ఓటర్లను ఆకర్షించాల్సిన అవసరం మధ్య సమతుల్యతను సాధించడం ఒక బలీయమైన పనిగా మారింది. బిజెపి పాలిత రాష్ట్రాల కంటే ఇతర రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వడంపై ప్రత్యర్థి పార్టీల నుండి సంభావ్య విమర్శలను పరిగణనలోకి తీసుకుంటే,పెన్షన్‌లను పెంచే అంశం బిజెపికి సున్నితమైన విషయం. అదే విధంగా గ్యాస్ సిలిండర్ రేట్లు బిజెపికి సవాలుగా ఉన్నాయి. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ రెండూ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రజాదరణ పొందిన ప్రకటనలు చేశాయి. ఆ పార్టీలుఇచ్చిన పోటీ వాగ్దానాల దృష్ట్యా తెలంగాణ ఎన్నికల కోసం తన మేనిఫెస్టోను రూపొందించడంలో బిజెపికి చాలా సవాలుగా మారింది.