పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బిజెపి ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఫలితం
పార్టీ నియామావళికి ఇది విరుద్ధమని స్పష్టీకరణ పార్టీ బాధ్యతల నుంచి
తొలగింపు సెప్టెంబర్ 2లోగా వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు ప్రవక్తపై
వ్యాఖ్యలతో భగ్గుమన్న మైనారిటీలు బిజెపి ఎంఎల్‌ఎపై పలు స్టేషన్‌లలో
ఫిర్యాదు హైడ్రామా మధ్య రాజాసింగ్ అరెస్టు నాంపల్లి కోర్టులో హాజరు
తొలుత 14రోజుల రిమాండ్‌కు ఆదేశం తరువాత బెయిల్ పిటిషన్‌పై విచారణ
భేషరతు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం
మన తెలంగాణ/హైదరాబాద్ : మహ్మద్ ప్రవక్తపై గోషామహల్ ఎంఎల్‌ఎ రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ప్రకంపనలు సృష్టించాయి. దీంతో బిజెపి హైకమాండ్ ఈ విషయమై జాగ్రత్త పడింది. వెనువెంటనే రియాక్ట్ అయింది. ఈ విషయంపై ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీరియస్ అయ్యారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఆదేశాల మేరకు రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. బిజెపి సభా పక్షనేత పద వి నుంచి కూడా తప్పించింది. బిజెపి ని యామావళికి విరుద్దంగా వ్యవహరించినందుకు గాను ఈ చర్యలు తీసుకొంటున్నట్టుగా ఆ ప్రకటనలో పేర్కొంది. పార్టీ నియామావళికి విరుద్దంగా వ్యవహరించినందున సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. అయితే ఈ విషయమై 10 రో జు ల్లో వివరణ ఇవ్వాలని కూడా రాజాసిం గ్‌ను బిజెపి నాయకత్వం ఆదేశించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 2 వ తేదీ లోపుగా ఈ విషయ మై స్పష్టత ఇవ్వాలని కోరింది.
స్టాండప్ కమేడియన్ మునావర్ ఫారూఖీ కామెడీ షోను నిర్వహించడాన్ని నిరసిస్తూ 10 నిమిషాల 27 సెకెండ్ల నిడివి ఉన్న ఓ వీడియోను ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మీద సోమవారం రాత్రి పోస్ట్ చేశారు. ఈ వీడియో పోస్ట్ అయిన కొన్ని గంటల వ్యవధిలోనే హైదరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రాజా సింగ్‌ను అరెస్ట్ చేయాలంటూ ఎఐఎంఐఎం సహా పలువురు ముస్లిం సంఘాల ప్రతినిదులు సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు పెద్ద ఎత్తున ఆందోళనలను చేపట్టారు. నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. బషీర్ బాగ్‌లో గల హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కార్యాలయం ముందు బైఠాయించారు.
రాజా సింగ్‌కు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఎంఐఎం శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. మంగళవారం ఉదయం రాజాసింగ్‌ను ఆయన ఇంటి వద్దే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి నుండి బొల్లారం పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. బొల్లారం పోలీస్ స్టేషన్ నుండి నాంపల్లి కోర్టుకు తరలించారు. మంగళ్‌హాట్ పిఎస్‌లో ఖదీర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆయనపై 153(ఎ), 295-(ఎ), 504, 505 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉస్మానియాలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. 14 వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్… రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ తర్వాత రాజాసింగ్ తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి సీఆర్‌పీసీ 41-ఎ కింద బెయిల్ మంజూరు చేశారు.
నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత.. ఇరువర్గాలపై పోలీసుల లాఠీఛార్జి
నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాంపల్లిలో రాజాసింగ్‌కు వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేశారు. మరోవైపు రాజాసింగ్ వర్గీయుల ఆందోళన చేయడంతో వాతావరణం రణరంగాన్ని తలపించింది. ఇరువర్గాల నినాదాలతో కోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో ఇరువర్గాలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అదనపు బలగాలతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు. సదరు వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారని ఎంఐఎం ఆరోపణలు చేసింది. దీంతో ఈ వీడియోను తొలగించాలని యూట్యూబ్‌ను హైద్రాబాద్ పోలీసులు కోరారు పోలీసుల వినతి మేరకు ఈ వీడియోను యూట్యూబ్ తొలగించింది.
రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల కేసులు
రాష్ట్రవ్యాప్తంగా రాజాసింగ్‌పై ఆరు చోట్ల కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్‌లోనే రాజాసింగ్‌పై నాలుగు చోట్ల కేసులు నమోదయ్యాయని తెలిపారు. మంగళ్‌హాట్, బహదూర్‌పుర, డబీర్‌పురా, బాలానగర్, పంజాగుట్ట, బాలాపూర్ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి, నిజామాబాద్‌లోనూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. ఎల్బీనగర్, వనస్థలిపురం, బాలాపూర్, కుషాయిగూడ పీఎస్‌ల పరిధిలోనూ ఫిర్యాదులు వచ్చాయని రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు.
ఆ జిల్లాల్లో హైఅలర్ట్
ఇక ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్న నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వికారాబాద్, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో హైఅలర్ట్‌ను పోలీసులు ప్రకటించారు. సున్నిత ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యలను తీసుకున్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు.