Monday, December 23, 2024

రాజస్థాన్ లో బిజెపి సెల్ఫ్ గోల్ ?

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్ ఎన్నికల్లో తరచూ ప్రభుత్వ వ్యతిరేకతే కీలక పాత్ర వహిస్తూ ఉంటుంది. అందుకే గత పాతికేళ్లుగా కాంగ్రెస్, బీజేపీ… ఒకదాని తర్వాత మరొకటి అధికారంలోకి రావడం ఆనవాయితీగా మారింది. ఈ రెండు పార్టీలలోనూ ఇద్దరు వ్యక్తులు … ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత వసుంధర రాజే మాత్రమే ఒకరి తర్వాత మరొకరు ముఖ్యమంత్రిగా ఎన్నిక అవుతున్నారు.

ఈ ఒరవడి ఇలాగే కొనసాగితే ఈ పర్యాయం ప్రతిపక్షంలో ఉన్న బిజెపి అధికారంలోకి రావాలి. పలు ఎన్నికల సర్వేలు సైతం బిజెపి పూర్తి ఆధిక్యతతో అధికారంలోకి రాబోతున్నట్లు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికీ వసుంధర రాజే ప్రజాదరణలో తిరుగులేని నాయకురాలిగా కొనసాగుతూ ఉండడంతో ఆమె మరోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు సహజంగా ఎటువంటి ఇబ్బంది ఉండే ఆస్కారం లేదు.

అయితే, గతంలో కాంగ్రెస్ అనుసరించినట్లు రాష్ట్రాలలో బలమైన నాయకులు ఉండకూడదని, అందరూ ఢిల్లీలోని అధిష్ఠానం కనుసన్నలలో ఉండాలని భావిస్తున్న బిజెపి అగ్రనాయకత్వం.. ఆమెను మరోసారి ముఖ్యమంత్రిగా చేసేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. మొదటి జాబితాలో ఆమె సీటు ప్రస్తావన లేకపోవడం, ఆమె ప్రత్యర్ధులైన కేంద్ర మంత్రులతో సహా పలువురిని పోటీకి దింపడం ద్వారా ఆమె స్థానంలో మరో నాయకుడి కోసం అధిష్ఠానం చూస్తున్నట్లు అర్థమవుతోంది.

రాజస్థాన్ లో బిజెపికి బలమైన పునాదులు వేసిన మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఉప రాష్ట్రపతి భైరాన్ సింగ్ షెకావత్ అల్లుడైన నారప్ప సింగ్ రజ్వీ ప్రాతినిధ్యం వహిస్తున్న జైపూర్ లోని విద్యాధర్ నగర్ సీటును జైపూర్ రాజవంశానికి చెందిన రాజసమండ్ ఎంపీ దివ్య కుమారికి కేటాయించడం రాజస్థాన్ బీజేపీలో కలకలం రేపింది. ఐదుసార్లు ఎమ్యెల్యేగా ఎన్నికైన నారప్ప సింగ్ రజ్వీ సీటును బైరాన్ సింగ్ షెకావత్ శతజయంతి సంవత్సరం ప్రారంభం సందర్భంగా దివ్యకుమారికి కేటాయించారు.

వసుంధర రాజే కు నారప్ప సింగ్ సన్నిహితంగా ఉన్నందుకే ఆయన సీటుకు ఎసరు పెట్టారని ఆయన వర్గం బహిరంగంగా ఆరోపిస్తోంది. మరో రాజవంశానికి చెందిన దివ్య కుమారిని బరిలోకి దించడం ద్వారా వసుంధరకు చెక్ పెట్టాలన్నది అధిష్ఠానం నిర్ణయంగా కనబడుతోంది. రాజస్థాన్ లోని అన్ని ప్రాంతాలలో వసుంధర రాజేకు పలుకుబడి ఉన్నట్లుగా బీజేపీలో మరెవరికీ లేదన్నది అందరికీ తెలిసిందే. కేంద్ర మంత్రులకు సైతం తమ నియోజకవర్గం పరిధి దాటి పలుకుబడి లేదు. రాష్ట్రంలోని 40 నియోజకవర్గాలలో జయాపజయాలపై ప్రభావం చూపగల శక్తి వసుంధర రాజెకు ఉంది. దాంతో ఆమెను నిర్లక్ష్యం చేయడం వల్ల అసలుకే ఎసరు రాగలదని చివరి నిమిషంలో గ్రహించిన పార్టీ పెద్దలు వసుంధరతో రాజీ చేసుకున్నారు. అయినాకూడా, పార్టీ ప్రచారంలో ఆమెకు చెప్పుకోదగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభలలో ఆమె గురించిన ప్రస్తావన తేకుండా “నన్ను చూసి ఓటు వేయండి .. నేనే మీకు హామీ” అని  చెబుతున్నారు.

బీజేపీలో నాయకత్వంపై నెలకొన్న ఈ గందరగోళ పరిస్థితి ఒక విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు వరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజస్థాన్ ఎన్నికలు  గెహ్లాట్- మోదీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా మారాయి. గెహ్లాట్ పరిపాలన సామర్ధ్యాన్ని ఆయన ప్రత్యర్థులు కూడా నిరాకరించలేని పరిస్థితి నెలకొంది. చతురతగల రాజకీయ వేత్తగా, సంక్లిష్ట పరిస్థితులను సైతం సంయమనంతో అధిగమించడంలో ఆయనకు ఆయనే సాటిగా పేరొందారు. అందుకనే కాంగ్రెస్ లో పక్కలో బల్లెంగా పేరొందిన నేత సచిన్ పైలట్ పట్ల రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ఆసక్తి ఉన్నప్పటికీ గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రిని మార్చే సాహసం చేయలేకపోయారు.

1998లో మొదటిసారి, రాష్ట్రంలోని 200 సీట్లలో 153 స్థానాలను గెలుచుకుని గెహ్లాట్ అధికారంలోకి వచ్చినప్పటినుండి, ఏ అధికార పార్టీ రెండవసారి గెలుపొందలేదు. దానితో ప్రభుత్వం మార్పుకు రాజస్థాన్ ప్రజలు ఒక విధంగా అలవాటు పడ్డారు.

గుజ్జర్ – మీనాల ఆధిపత్య పోరు

రాజస్థాన్ రాజకీయాలను గుజ్జర్ – మీనాల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు ప్రభావితం చేస్తుంటుంది. గుజ్జర్లు గెహ్లాట్ ను ముఖ్యమంత్రిగా ప్రశంసిస్తూనే పైలట్ (గుజ్జర్)ను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్న పైలట్ ముఖ్యమంత్రి అవుతారనుకొంటే, అలా చేయకుండా తమను  అవమానించారనే అభిప్రాయం వారిలో ఉంది. 2008లో ఎస్టీ రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ గుజ్జర్లు ఆందోళన చేసిన సమయంలో వారి ఆగ్రహం రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్న వసుంధర పైకి మళ్లింది. అయితే రిజర్వేషన్లు కల్పిస్తామని ఆమె హామీ ఇవ్వడంతో గుజ్జర్ల ఓట్లు గంపగుత్తగా ఆమెకు లభించాయి.

ఆ తర్వాత, పైలట్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడయ్యాక (2018) మాత్రమే గుజ్జర్లు తిరిగి కాంగ్రెస్‌కు ఓటు వేశారు. గుజ్జర్ల ఓటు 10 నుండి 15 స్థానాల్లో నిర్ణయాత్మకం కాగా నలభై సీట్లపై వారి  ప్రభావం ఉంది. దివంగత గుర్జర్ నాయకుడు కిరోరి సింగ్ బైంస్లా కుమారుడు విజయ్‌ని టోంక్‌లోని డియోలీ-యునియారా నుంచి పోటీకి దింపడం ద్వారా బిజెపి… గుజ్జర్లపై తన పట్టు కాపాడుకొనే ప్రయత్నం చేస్తోంది.

పొరుగు రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోని గుజ్జర్ నేతలను కూడా బిజెపి ఎన్నికల ప్రచారంలో దింపుతోంది. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి చెందిన ముస్లిం ఎంపీపై లోక్ సభలో అనుచిత పదజాలం ఉపయోగించిన యుపి ఎంపీ రమేష్ బిధూరిని రాజస్థాన్ లో ప్రచారానికి తీసుకొచ్చింది. మరోవైపు కాంగ్రెస్ నాయకులు కూడా గుజ్జర్ల ఓటును నిలబెట్టుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో టిక్కెట్ల పంపిణీలో పైలట్ కీలకపాత్ర పోషించడం ద్వారా గుజ్జర్ల మద్దతు చేజారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. ‘నీకు అవకాశం వచ్చేవరకు ఓపికతో ఉండు’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నచ్చచెప్పడంతో ముఖ్యమంత్రితో తనకున్న  విభేదాలను సచిన్ పైలట్ పక్కనపెట్టి, కాంగ్రెస్ విజయం కోసం కృషి చేస్తున్నారు.  అటువంటి ఉమ్మడి ప్రయత్నాలు బీజేపీలో కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి.

అయితే గుజ్జర్ల ఓట్లు ఒక పార్టీకి పడితే, షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) రిజర్వేషన్‌పై గుజ్జర్ల డిమాండ్ ను గట్టిగా ప్రతిఘటిస్తున్న మీనాలు మరో పార్టీకి మద్దతు పలికే అవకాశం ఉంది. బీజేపీ స్థానిక నేత కిరోరి లాల్ మీనాను ముఖ్య నేతగా ముందుకు తెస్తోంది. సాంప్రదాయబద్ధంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే మీనా ఓట్లను బీజేపీ చేజార్చుకోగా, గుజ్జర్ల ఓట్లను కాంగ్రెస్ కోల్పోతుందని ఆ పార్టీ అంచనా వేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News