జైపూర్: రాజస్థాన్‌లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మంగళవారం నాడిక్కడ సమావేశమై లాంఛనంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేస్తారని బిజెపి రాష్ట్ర నాయకులు సోమవారం నాడు వెల్లడించారు. బిజెపి శాసనభాపక్ష సమావేశం మంగళవారం జరుగనున్నట్లు పాక్టీ కేంద్ర పరిశీలకులు సోమవారం పార్టీ ఎమ్మెల్యేలకు సమాచారం అందచేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును పరిశీలకులు వెల్లడించనున్నారు. దీంతో డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత వారం రోజులకు పైగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది. పార్టీ కేంద్ర పరిశీలకులు మంగళవారం ఉదయం జైపూర్ చేరుకుని పార్టీ ఎమ్మెల్యేలతో ముఖాముఖీ చర్చలు జరిపి వారి అభిప్రాయాలను సేకరిస్తారని బిజెపి ఎమ్మెల్యే జోగేశ్వర్ గర్గ్ సోమవారం నాడిక్కడ తెలిపారు.
మధ్యాహ్నం భోజన విరామం అనంతరం ఎమ్మెల్యేలు తిరిగి సమావేశమై తమ శాసనసభా పక్ష నాయకుడిని ఎంపియేసుకుంటారని ఆయన చెప్పారు. పార్టీ పరిశీలకులుగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సరోజ్ పాండే, వినోద్ తాడ్వేలను పార్టీ నియమించింది. శాసనసభా పక్ష సమావేశం గురించి ఎమ్మెల్యేలకు సమాచారం అందిందని బిజెపి ఎమ్మెల్యే కిరోడి లాల్ మీనా తెలిపారు. రాజస్థాన్ అసెంబ్లీలోని మొత్తం 199 స్థానాలలో 115 స్థానాలను బిజెపి గెలుచుకుంది. ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడుతున్న వారిలో మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజె ప్రముఖంగా ఉన్నారు. ఆమెతోపాటు కేంద్ర మంత్రులు అర్జున్ రాం మేఘావల్, గజేంద్ర సింగ్ షెకావత్, అశినీ వైష్ణవ్ ఆశావహులలో ఉన్నారు.