Friday, November 22, 2024

రాజస్తాన్‌లో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ

- Advertisement -
- Advertisement -

Rajasthan Cabinet expanded

మంత్రులుగా 15 మంది ప్రమాణస్వీకారం

జైపూర్ : రాజస్థాన్ ప్రభుత్వ కేబినెట్ మళ్లీ కొలువు తీరింది. ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్ ముందుగా నిర్ణయించుకున్నట్టు గానే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు 15 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో 11 మంది కేబినెట్ మంత్రులు కాగా, నలుగురు సహాయ మంత్రులు. ఇందులో ముగ్గురు మంత్రులుగా ఇదివరకే పనిచేసిన వారుండగా, 12 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. రాష్ట్ర రాజధాని జైపూర్‌లో ఉన్న రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా వీరిచే ప్రమాణస్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి అజయ్‌మాకెన్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. క్యాబెనెట్ లో సచిన్ మద్దతుదారులు ఐదుగురు ఉన్నారు. ఈ వర్గానికి ఎక్కువ ప్రాధాన్యం లభించింది. రమేష్ మీనా, విశ్వేంద్ర సింగ్ తిరిగి మంత్రి పదవులు పొందారు. వీరితోపాటు బ్రిజేంద్ర సింగ్ ఓలా, మేమారన్ చౌదరి, మురీలాల్ మీనాకు మంత్రివర్గంలో చోటు లభించింది. గత ఏడాది అశోక్‌గెహ్లాట్‌కు వ్యతిరేకంగా సచిన్‌పైలట్ వర్గం తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే.

గత ఏడాది 11 మంది కేబినెట్ మంత్రుల్లో మమతా భూపేష్, భజన్‌లాల్ జాతవ్, టిక్రంజుల్లీ, ఈ ముగ్గురికి సహాయ మంత్రి పదవుల నుంచి కేబినెట్ మంత్రులుగా అవకాశం కల్పించారు. మంత్రివర్గ ప్రక్షాళనకు ముందు ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 21 మంది మంత్రులు ఉండగా, ఈ సంఖ్య ఇప్పుడు 30 కి చేరింది. ముఖ్యమంత్రితో కలిపి గరిష్ఠంగా 30 మంది మంత్రులు ఉండవచ్చు. గత కేబినెట్‌లో మంత్రులుగా పనిచేసిన గోవింద్ సింగ్ దోత్సారా, హరీశ్ చౌదరి, రఘుశర్మను మంత్రి వర్గం నుంచి తప్పించారు. మిగిలినవారు యథావిధిగా మంత్రులు గానే కొనసాగారు. కొత్తగా 12 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. హేమారామ్ చౌదరి, మహేంద్రజీత్ సింగ్ మాలవీయ, రామ్‌లాల్ జాట్, మహేష్ జోషి, గోవిందరామ్ మెఘావల్, శకుంతలా రావత్ కూడా ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఉన్నారు. మంత్రి వర్గం నుంచి ఇప్పుడు తప్పుకున్నవారిలో రఘుశర్మ గుజరాత్ ఎఐసిసి ఇన్‌ఛార్జిగా , హరీష్ చౌదరి పంజాబ్ ఎఐసిసి ఇన్‌ఛార్జిగా, గోవింద్‌సింగ్ దోత్సారా రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్‌గా నియామకమయ్యారు.

ప్రమాణస్వీకారం అయిన తరువాత ముఖ్యమంత్రి గెహ్లాట్ పాత్రికేయులతో మాట్లాడుతూ షెడ్యూల్డు తెగలు లేదా షెడ్యూల్డు కులాలు, వెనుకబడిన తరగతులు లేదా మైనార్టీలు ఎవరైనా కానీ అందరికీ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభించిందని చెప్పారు. కొంతమంది ఎమ్‌ఎల్‌ఎలకు మంత్రివర్గంలో అవకాశం ఇప్పుడు లభించలేదని, అయితే పార్లమెంటరీ సెక్రటరీ, సిఎం సలహాదారు. వివిధ బోర్డుల కార్పొరేషన్ల ఛైర్మన్లు గా వారిని సర్దుబాటు చేయడమౌతుందని వివరించారు. మాజీ డిప్యూటి సిఎం పైలట్ ఈ మంత్రివర్గంలో దళితులు, గిరిజనులు, మహిళల ప్రాతినిధ్యం పెరిగిందని, ఇది స్వాగతించదగిందని ప్రశంసించారు. ప్రస్తుత మంత్రివర్గంలో దళిత వర్గానికి చెందిన నలుగురికి కేబినెట్ మంత్రులుగా అవకాశం లభించింది. వీరిలో ముగ్గురికి సహాయ మంత్రుల నుంచి కేబినెట్ హోదాగా ప్రొమోట్ అయ్యారు. మరొకరు గోవింద్‌రామ్ మెఘ్వాల్ కొత్తవారు. అలాగే ముగ్గురు మహిళలకు మంత్రిపదవులు లభించాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News