Friday, January 3, 2025

రాజస్థాన్‌లో వేధింపులు తాళలేక లేడి డాక్టర్ ఆత్మహత్య !

- Advertisement -

Dr Archana Sharma
జైపూర్: అర్చన శర్మ అనే ఓ డాక్టర్ వేధింపులు తాళలేక బుధవారం ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు ఆమె తాను నిర్దోషినన్న సుసైడ్ నోట్‌ను కూడా వదిలిపోయింది. స్థానిక బిజెపి నాయకుడొకడు ప్రజలను రెచ్చగొట్టి ఆమె చావుకు కారణమైనందుకు అరెస్టయ్యాడు.
రాజస్థాన్‌కు చెందిన దౌసాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ మహిళా రోగి మంగళవారం బిడ్డకు జన్మనిచ్చాక ‘హేమరేజ్’తో చనిపోయింది. ఆ తర్వాత ఆమె కుటుంబీకులు ఆసుపత్రి బయట నిరసన ప్రదర్శన జరిపారు. డాక్టర్ అర్చనా శర్మ, ఆమె భర్తపై పోలీసులు హత్య కేసు నమోదు చేశాకే అక్కడి నుంచి వారు కదిలిపోయారు. అయితే తన ఆసుపత్రి బయట వారు నిరసన ప్రదర్శన జరపడం, ఆ తర్వాత పోలీసులు కేసు పెట్టడం వంటి వాటికి ఆ లేడీ డాక్టర్ కలత చెందింది. ఆమె తన భర్తతో కలిసి ఆ ఆసుపత్రిని నడిపుతోంది.
ఇదిలావుండగా పోలీసులపై చర్య తీసుకోవాలంటూ డాక్టర్లు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఎందుకంటే పోలీసులు ఆ లేడి డాక్టర్ అర్చనా శర్మపై కేవలం రోగి కుటుంబీకులు సమర్పించిన ఫిర్యాదుపై హత్య కేసు నమోదుచేశారు. ఇదిలావుండగా దౌసలో లేడి డాక్టర్ ఆత్మహత్య చేసుకోవడంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బుధవారం దౌస ఎస్పీ అనీల్ కుమార్‌ను తొలగించారు. తన భార్యపై ఎఫ్‌ఐఆర్‌ను దాఖలు చేయాలని స్థానిక బిజెపి నాయకులు ఒత్తిడి తెచ్చారని ఆమె భర్త ఆరోపించారు. దాని కారణంగానే తన భార్య ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందన్నారు.
ఆశ బైర్వా(22) అనే మహిళ దౌసలోని లాల్‌సాట్‌లో ఆనంద్ ఆసుపత్రిలో ప్రసవించి చనిపోయింది. ఆమె భర్త లాలూరామ్ బైర్వా, బంధువులు ఆమె భౌతిక కాయాన్ని తమ ఊరికి తీసుకెళ్లి మళ్లీ ఆ భౌతిక కాయంను ఆసుపత్రికి తీసుకొచ్చి హంగామా చేశారు. దానికి కొందరు స్థానిక బిజెపి నాయకులు తోడయి ఆజ్యం పోశారు. దాంతో నిరసన పెద్దదయిపోయింది. స్థానిక పోలీసులు రంగప్రవేశం చేసి తగిన చర్యలు తీసుకుని దర్యాప్తు చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ఆ తర్వాత డాక్టర్ అర్చనా శర్మ, ఆమె భర్త డాక్టర్ సునీత్ ఉపాధ్యాయలపై ఐపిసి సెక్షన్ 302(హత్య) కేసును పోలీసులు బుక్ చేశారు. ఆ దంపతులు ఆనంద్ హాస్పిటల్‌ను నడుపుతున్నారు. డాక్టర్ అర్చన తన సుసైడ్ నోట్‌లో “నేను నా భర్తను, పిల్లలను చాలా ప్రేమిస్తున్నాను. నా మరణం తర్వాత వారిని బాధించకండి. నేనేమి తప్పు చేయలేదు. ఆ మహిళా రోగి మరణానికి కారణం పిపిహెచ్(పోస్ట్‌పార్టం హేమరేజ్). నా చావు తర్వాత అయినా నా నిరాపరాధం రుజువవుతుందనుకుంటున్నా. దయచేసి డాక్టర్లను వేధించకండి’ అని రాసి ఆత్మహత్య చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News