జైపూర్: రాజస్థాన్‌లో కాంగ్రెస్, బీఎస్‌పిలకు ఎప్పుడూ మద్దతు ఇస్తున్న షెడ్యూల్డ్‌కులాలు, షెడ్యూల్డ్ తెగల సంపదాయ ఓటు బ్యాంకును ఈసారి బీజేపీ కొల్లగొట్టగలిగింది. దాంతో పోలింగ్ జరిగిన 199 స్థానాల్లో 115 స్థానాలను చేజిక్కించుకోగలిగింది. పోలింగ్ జరిగిన 34 షెడ్యూల్డ్ కులాల స్థానాల్లో 22 బీజేపీ ఖాతా లోకి వెళ్లగా, 11 కాంగ్రెస్ హస్తగతమయ్యాయి. మరొకటి ఇండిపెండెంట్‌కు దక్కింది. అలాగే ఎస్‌టి రిజర్వుడ్ 25 స్థానాల్లో 12 బీజేపీకి, 10 కాంగ్రెస్‌కి,3 భారతీయ ఆదివాసీ పార్టీకి దక్కాయి. 2018లో బీఎస్‌పి సాధించుకున్న నాడ్‌బై, నగర్, కరౌలీ, తిజారా స్థానాల్లో ఇప్పుడు బీజేపీ విజయపతాకం ఎగురవేసింది. అలాగే కాంగ్రెస్ ఉదయ్‌పూర్వతి, కిషన్‌గడ్ బాస్ స్థానాలను దక్కించుకుంది. ఇవన్నీ 2018లో మాయావతి నేతృత్వం లోని బీఎస్‌పి కైవశం కాగా, ఆ తరువాత ఆ ఎమ్‌ఎల్‌ఎలంతా కాంగ్రెస్‌లో చేరారు. 2018 కన్నా ఈసారి బీజేపీ మొత్తం ఓట్లలో 41.69 శాతం సాధించగలిగింది. అంటే 2018 నాటి కన్నా 2.41 శాతం ఎక్కువ.
కాంగ్రెస్, బీఎస్‌పి ఓటు వాటా ఈసారి క్రమంగా 0.29, 2.26 శాతం తగ్గింది. 2018లో బీఎస్‌పీ ఓటు వాటా 4.08 శాతం ఉండగా, ఈసారి 1.82 శాతం తగ్గిపోయింది. ఇప్పటి ఎన్నికల్లో మొత్తం ఓట్లలో కాంగ్రెస్ 39.53 శాతం పొందింది. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్, ఆమ్‌ఆద్మీ పార్టీల ఓటు వాటా చెక్కుచెదరకుండా అలాగే ఉంది. రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ ఓటు వాటా 2.39 శాతంగా నమోదైనప్పటికీ, ఆ పార్టీ అభ్యర్థి హనుమాన్ బేణీవాల్ పోటీ చేసిన నియోజకవర్గం ఒక్కటే ఈసారి విజయం సాధించింది. 2018 ఎన్నికల్లో ఈ పార్టీ 2.4 శాతం ఓట్ల వాటాతో మూడు స్థానాలను గెలుచుకోగలిగింది. ఆప్ 2018 నాటి మాదిరిగానే రాజస్థాన్‌లో ఈసారి ఏ స్థానం గెలుచుకోలేకపోయినా, మొత్తం ఓట్లలో 0.38 శాతం వాటా దక్కించుకోగలిగింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దళితుల మద్దతు కాంగ్రెస్‌కు ఊపిరి పోసింది. 34 ఎస్‌సి రిజర్వుడ్ సీట్లలో 19 కాంగ్రెస్ పొందగలిగింది. బీజేపీ 12 సీటు,్ల ఆర్‌ఎల్‌పి 2, ఇండిపెండెంట్‌గా బరిలో దిగిన కాంగ్రెస్ రెబెల్ ఒకటి దక్కించుకోగలిగారు.
2018లో ఎస్‌టి కేటగిరి స్థానాలు 9 బీజేపీకి రాగా, కాంగ్రెస్‌కు 12 వచ్చాయి. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌సి సమాజం బీజేపీకి భారీ ఎత్తున ఓట్లు వేసింది. మొత్తం 34 ఎస్‌సి రిజర్వుడ్ స్థానాల్లో 32 స్థానాలు బీజేపీ గెల్చుకుంది. ఆనాడు బీజేపీ 163 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ మాత్రం 21 స్థానాలకే పరిమితం కావలసి వచ్చింది.