దేశద్రోహ చట్టంపై సుప్రీం స్టే పరిణామం
జైపూర్ : జర్నలిస్టు అమన్ చోప్రాపై దాఖలు అయిన రాజద్రోహపు మూడో కేసును రాజస్థాన్ హైకోర్టు బుధవారం నిలిపివేసింది. ఇదే రోజు సుప్రీంకోర్టు దేశ ద్రోహ చట్టం పరిధిలో దాఖలు అయ్యే కేసులను తాత్కాలికంగా నిలిపివేయాలని తీర్పు ఇచ్చింది. దీనిని పరిగణనలోకి తీసుకుని హైకోర్టుకు చెందిన జోధ్‌పూర్ బెంచ్ వెనువెంటనే స్పందించింది. ఈ జర్నలిస్టుపై కేసు విచారణను నిలిపివేస్తున్నట్లు , తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ ఈ స్టే అమలులో ఉండనున్నట్లు తెలిపింది. నోయిడా వాసి అయిన ఈ జర్నలిస్టు అరెస్టును ఒక్కరోజు క్రితమే రాజస్థాన్ హైకోర్టు నిలిపివేసితదుపరి విచారణ మరుసటి రోజు అంటే బుధవారం జరుగుతుందని తెలిపింది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసులవిచారణను నిలిపివేయాలని పేర్కొనడంతో జోధ్‌పూర్ బెంచ్ స్పందించింది. సంబంధిత అభియోగంపై అత్యున్నత న్యాయస్థానం రూలింగ్‌ను తాము పరిగణనలోకి తీసుకుని అందుకు అనుగుణంగానే వ్యవహరించాల్సి ఉంటుందని , క్లయింట్ తరఫున లాయర్లు తమ దృష్టికి సుప్రీంకోర్టు తీర్పును తెలియచేసినందున తాము సంబంధిత కేసును ప్రస్తుతానికి పక్కన పెడుతున్నట్లు ఆదేశాలు వెలువరించింది. కేసుకు సంబంధించి ఇంటరాగేషన్‌కు నిందితుడు బిచ్చివాడ పోలీసు స్టేషన్ విచారణాధికారి ఎదుట హాజరు కావాల్సి ఉంటుందని ఆదేశించింది. రెండు వర్గాల మధ్య వైషమ్యాలు రేకెత్తించేలా జర్నలిస్టు తమ టీవీ చర్చ దశలో వ్యవహరించారని అభియోగాలు వెలువడ్డాయి.