Sunday, January 19, 2025

రాజస్థాన్ గనిలో కూలిన లిఫ్ట్

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్‌లోని ప్రముఖ హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్ సంబంధిత గనిలో బుధవారంతెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. గనిలోని లిఫ్ట్ కూలిన ఘటనలో సంస్థకు చెందిన చీఫ్ విజిలెన్స్ ఆఫీసరు ఉపేంద్ర కుమార్ పాండే దుర్మరణం చెందారు. నీమ్ కా థానా ప్రాంతంలోని ఈ గనులలో జరిగిన ఈ ప్రమాదంలో 14 మంది వరకూ లోపల గంటల తరబడి చిక్కుకుపొయ్యారు. వెంటనే సహాయక బృందాలు అక్కడికి వచ్చి జరిపిన గాలింపు చర్యల క్రమంలో వీరిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అయితే గనిలోపల పాండే చనిపోయి ఉండగా గుర్తించి, భౌతికకాయాన్ని తీసుకురాగలిగారు. గనులలో పనుల తీరును పర్యవేక్షించేందుకు కోల్‌కతాకు చెందిన హెచ్‌సిఎల్ బృందం గనుల వద్దకు వెళ్లింది. వీరు కేజ్ ద్వారా తిరిగి వస్తుండగా కేబుల్ తెగిపోవడంతో విజిలెన్స్‌బృందం గనులలో 1875 అడుగుల లోతున పడిపోయ్యారు. తనిఖీలు జరిపి వస్తుండగా గనులలో వీరు గంటల తరబడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడాల్సి వచ్చింది.

ఘటన గురించి రాజస్థాన్ పోలీసు విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ అనిల్ పాలీవాల్ విలేకరులకు తెలిపారు. సహాయక చర్యల్లో భాగంగా గనిలోపల అధికారి భౌతిక కాయం గుర్తించారని, మిగిలిన వారిని బయటకు తీసుకువచ్చారని వివరించారు. సహాయక బృందాలు పలు సార్లు లోపలికి వెళ్లి మిగిలిన వారిని భద్రంగా తీసుకువచ్చారు. వీరిలో కొందరికి స్వల్పగాయాలు అయ్యాయి. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రాజస్థాన్‌లోని ఖేత్రీనగర్ హెచ్‌సిఎల్ కాపర్ కాంప్లెక్స్ గనిలో ఈ ప్రమాదం జరిగిందని సంస్థ అధికారికంగా తెలిపింది. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ఢిలీలో మైన్స్ సెక్రెటరీ విఎల్ కాంతారావు తెలిపారు. ఈ లిఫ్ట్ బాగానే ఉందని, ఇందులోనే తాను గత నెలలో గనుల్లోకి వెళ్లానని, ఇప్పుడు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది? కేబుల్స్ తెగిపోవడానికి కారణాలను ఆరాతీస్తామని ఆయన వివరించారు. మృతి చెందిన విజిలెన్స్ అధికారి పాండే గత ఏడాది గత ఏడాది జూన్‌లోనే బాధ్యతలు తీసుకున్నారు. ఆయనది ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ అని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News