జైపూర్ : రాజస్థాన్ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్రమంత్రి శాంతి కుమార్ ధరీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అఫైర్లు, తల్లిదండ్రుల ఒత్తిడే విద్యార్థుల ఆత్మహత్యలకు పురిగొలుపు తున్నాయని వ్యాఖ్యానించారు. జార్ఖండ్ లోని రాంచీకి చెందిన రిచా సిన్హా (16) బుధవారం తన రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై మంత్రి శాంతికుమార్ స్పందించారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణాలు తెలుసుకునేందుకు ప్రతికేసు లోనూ లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు.
తాజాగా ఝార్ఖండ్ బాలిక ఆత్మహత్య కేసులోనూ ఆమెకు అఫైర్ ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది.ఆమె సూసైట్ లెటర్ రాసిపెట్టి బలవన్మరణానికి పాల్పడింది”అని ధరీవాల్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా చదువులో ముందుండాలంటూ తల్లిదండ్రులు తెచ్చే ఒత్తిడి కూడా విద్యార్థుల మరణాలకు ఓ కారణమని ఆయన అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఇప్పటివరకు 25 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. రాజస్థాన్ పోలీస్ డేటా ప్రకారం 2022లో 15 మంది, 2019లో 18 మంది, 2018లో 20 మంది, 2017లో ఏడుగురు, 2016లో 17 మంది, 2015లో 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
అయితే కరోనా కారణంగా కోచింగ్ సెంటర్లు మూతపడటంతో 2020,2021లో కోటాలో ఒక్క విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకోలేదు. మరోవైపు విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు రాజస్థాన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యార్థులు ఎక్కువగా ఫ్యాన్లకు ఉరివేసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు గుర్తించింది. కోటా లోని అన్ని హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ వసతుల్లో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను అధికారులు ఏర్పాటు చేశారు. లోడ్‌ను గుర్తించిన వెంటనే అన్‌కాయిల్ అయ్యేలా ఈ ఫ్యాన్లను తయారు చేశారు. లోడ్ అవ్వగానే సీలింగ్ నుంచి ఫ్యాన్ కిందకు జారి పోతుంది. ఈ చర్యలతో కాస్త మేర ఆత్మహత్య సంఘటనలను తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు.