జైపూర్: రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లా బంద్ బరేత అభయారణ్యంలో లభించే అత్యంత ప్రత్యేకమైన గులాబీరంగు రాయి(పింక్ శాండ్‌స్టోన్) అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి ఉపయోగపడేందుకు మార్గం సుగమమైంది. దేశవ్యాప్తంగా భవన నిర్మాతలు అత్యంత మక్కువ చూపే పింక్ శాండ్‌స్టోన్ లభించే బంద్ బరేత అభయారణ్యంలో మైనింగ్‌కు అనుమతి ఇవ్వాలన్న ప్రతిపాదనకు రాజస్థాన్ వైల్డ్‌లైఫ్ బోర్డుకు చెందిన స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. బంధ్ బరేత అభయారణ్యాన్ని మైనింగ్ కోసం డీనోటిఫై చేయాలన్న ప్రతిపాదన ఇప్పుడు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సారథ్యంలోని రాజస్థాన్ వైల్డ్‌లైఫ్ బోర్డు ముందుకు రానున్నదని చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ మోహన్ మీనా బుధవారం తెలిపారు. ముఖ్యమంత్రి నేతృత్వంలోని బోర్డు ఆమోదం లభించాక ఈ ప్రతిపాదనను జాతీయ వైల్డ్‌లైఫ్ బోర్డుకు పంపుతామని ఆయన చెప్పారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం అనేక సంవత్సరాలుగా భరత్‌పూర్‌లోని బన్సీ పహార్‌పూర్ గనులలో లభించే పింక్ శాండ్‌స్టోన్‌ను మైనింగ్ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ శిలలను ఆకృతులుగా మలచడం జరుగుతోందని, ఆలయ నిర్మాణం ప్రారంభమైన వెంటనే వీటిని అమర్చడమే తరువాయని అయోధ్యలోని వర్గాలు తెలిపాయి. పహార్‌పూర్ గనులలో పింక్ శాండ్‌స్టోన్ లభ్యత తగ్గిపోవడంతో బంధ్ బరేత అభయారణ్యంలో వెలికితీసే పింక్ శాండ్‌స్టోన్‌తో రామాలయ నిర్మాణానికి అవసరమైనంత మేర శిలలు లభించగవలవని భావిస్తున్నారు. అయితే రాజస్థాన్ ప్రభుత్వం అయోధ్య రామమందిర నిర్మాణం కోసం బంధ్ బరేత అభయారణ్యాన్ని డీనోటిఫై చేయడం లేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఈ రాతికి అత్యంత డిమాండ్ ఉందని, అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.