Tuesday, November 5, 2024

రాజస్థాన్ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రాజస్థాన్ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతుండగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం చాలా దృఢంగా ఉంటుందని, ఏ నాయకులను లేదా కార్యకర్తలను శాంతింప చేయడానికి పదవులు ఇచ్చే సంప్రదాయం పార్టీలో లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో వ్యూహాత్మక సమావేశమైన సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తోను, గెహ్లాట్‌ను విభేదిస్తున్న సచిన్ పైలట్ తోను సోమవారం విడివిడిగా చర్చించి వారి మధ్య సయోధ్య చేకూర్చడానికి ఖర్గే నిర్ణయించారు.

తాను చేసిన మూడు డిమాండ్లు ఈ నెలాఖరులోగా రాష్ట్రప్రభుత్వం నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతానని సచిన్‌పైలట్ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటమ్ విధించడంతో ఈ సమావేశం తక్షణం ఏర్పాటు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. వసుంధర రాజే హయాంలో రాజస్థాన్‌లో జరిగిన అవినీతిపై ఉన్నతస్థాయి దర్యాప్తు నిర్వహించాలని పైలట్ చేస్తున్న డిమాండ్లలో ఒకటి. ఈ నేపథ్యంలో గెహ్లాట్ నేతలను బుజ్జగించడానికి పదవులు ఇచ్చే సంప్రదాయం పార్టీలో లేదని వ్యాఖ్యానించారు. పైలట్‌ను శాంతింప చేసే ఫార్ములా ఏదో ఉంటుందా అన్న విలేఖర్ల ప్రశ్నకు గెహ్లాట్ అలాంటిదేమీ లేదని కొట్టి పారేశారు.

కాంగ్రెస్‌లో ఇంతవరకు అలాంటిదేమీ జరగలేదని, ఇకముందు కూడా జరగబోదని సిఎం గెహ్లాట్ వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లో 2018లో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన దగ్గర నుంచి గెహ్లాట్, పైలట్ మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. 2020లో పార్టీ రాష్ట్ర అధ్యక్షపదవి, డిప్యూటీ సిఎం పదవి నుంచి పైలట్‌ను తప్పించిన దగ్గర నుంచి గెహ్లాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పైలట్ పోరు సాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News