Monday, December 23, 2024

నేడే రాజస్థాన్‌లో పోలింగ్..

- Advertisement -
- Advertisement -

జైపూర్: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోరుకు రంగం సిద్ధమయింది. రాష్ట్రంలో గురువారం సాయంత్రంతో ప్రచారం ముగియగా శనివారం పోలింగ్ జగనుంది. రాజస్థాన్ అసెంబ్లీలో 200 స్థానాలుండగా, కరన్‌పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ ఇటీవల మరణించారు. దీంతో శనివారం 199 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోటింగ్ జరగనుంది. దాదాపు 5.25 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 1862 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలో ప్రధాన పార్ట్టీలుగా ఉన్న అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిజెపి ప్రచారంతో హోరెత్తించాయి. ఆయా పార్టీల అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బిజెపి ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మాపై ఆధారపడింది. ఆయన కూడా రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పలు ర్యాలీలు, రోడ్డుషోలలో పాల్గొన్నారు.

రాష్ట్రంలో మహిళలపై పెరిగిన నేరాలు,అవినీతి, పేపర్ లీకులను లక్షంగా చేసుకుని కమలం పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. మరో వైపు అధికార కాంగ్రెస్ తమ ప్రభుత్వ పని తీరు. అమలు చేస్తున్న పథకాలతో పాటుగా మళ్లీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న ఏడు గ్యారంటీలను ప్రచారాస్త్రాలుగా చేసుకుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలాంటి నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రాజస్థాన్‌లో 2018లో అధికార పీఠమెక్కిన్పటినుంచి కూడా కాంగ్రెస్ పాలన కలహాల కాపురంగానే సాగుతోంది.ప్రభుత్వ వ్యతిరేకతతో పాటుగా అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, మాజీ డిప్యూటీ సిఎం సచిన్ పైలట్ మధ్య విభేదాలు ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి. తాజా ఎన్నికల నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్య కాస్త సయోధ్య కుదిరినప్పటికీ వీరి వైరం పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.

ఇండియా కూటమిలోని ఆప్ వంటి పార్టీలు విడిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో అది కాంగ్రెస్ విజయావకాశాలపై ప్రభావం చూపించవచ్చని అంటున్నారు. మరో వైపు కమలం పార్టీ పరిస్థితి కూడా అంత బాగా లేదు. పార్టీలో అసమ్మతి బిజెపి నేతలను కలవరానికి గురి చేస్తోంది. మాజీ సిఎం వసుంధరా రాజె సింధియా వర్గానికి టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆమె వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. టికెట్ రాని పలువురు నేతలు, కార్యకర్తలు ఏకంగా పార్టీ కార్యాలయాలపైనే దాడి చేశారు. కొన్ని చోట్ల సిట్టింగ్ ఎంఎల్‌ఎలకు మళ్లీ టికెట్లు ఇవ్వడంపైనా ఆగ్రహం వ్యక్తమవుతోంది.ఈ రెండు పార్టీలకు చెందిన 40 మందికి పైగా తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో ఉన్నారు.కాగా శనివారం నాటి పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 10,501 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి ప్రవీణ్ గుప్తా తెలిపారు. మొత్తం 2.74 లక్షల మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.

ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం కోసం 1,02, 290 మంది భద్రతా సిబ్బందిని నియమించామని, వీరిలో 700 కంపెనీల సిఎపిఎఫ్ బలగాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇతర రాష్ట్రాలకు చెందిన భద్రతా సిబ్బంది సేవలను కూడా ఉపయోగించుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News