Tuesday, April 29, 2025

ఐపిఎల్‌లో సూర్యవంశీ నయా చరిత్ర

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ విధ్వంసక సెంచరీతో నయా చరిత్ర సృష్టించాడు. సూర్యవంశీ శివమెత్తి ఆడడంతో గుజరాత్ టైటాన్స్ ఉంచిన 210 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 15.5 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ యువ ఓపెనర్ సూర్యవంశీ చారిత్రక బ్యాటింగ్‌తో ఎన్ని రికార్డులను బద్దలు కొట్టాడు. ఐపిఎల్‌లో అత్యంత చిన్న వయసులో శతకం సాధించిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. అంతేగాక క్రిస్ గేల్ తర్వాత ఐపిఎల్‌లో అత్యంత వేగంగా శతకం సాధించిన బ్యాటర్‌గా కూడా కొత్త చరిత్ర నెలకొల్పాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన సూర్యవంశీ వరుస ఫోర్లు, సిక్సర్లతో గుజరాత్ బౌలర్లను హడలెత్తించాడు. యశస్వి జైస్వాల్‌తో కలిసి వైభవ్ స్కోరును పరిగెత్తించాడు. యశస్వి కాస్త సమన్వయంతో బ్యాటింగ్ చేయగా, వైభవ్ తొలి బంతి నుంచే దూకుడును ప్రదర్శించాడు. ఈ క్రమంలో 17 బంతుల్లోనే అర్ధ సెంచరీని సాధించి పెను ప్రకంపనలు సృష్టించాడు.

వైభవ్‌ను కట్టడి చేసేందుకు గుజరాత్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చెలరేగి ఆడిన సూర్యవంశీ కరీం జన్నత్ వేసిక ఒకే ఓవర్‌లో 30 పరుగులు బాదేశాడు. దీన్ని బట్టి అతని బ్యాటింగ్ ఏ స్థాయిలో సాగిందో ఊహించుకోవచ్చు. చారిత్రక ఇన్నింగ్స్ ఆడిన సూర్యవంశీ 38 బంతుల్లోనే 11 భారీ సిక్సర్లు, మరో ఏడు ఫోర్లతో 101 పరుగులు చేశాడు. ఇదే సమయంలో యశస్వితో కలిసి 11.5 ఓవర్లలోనే 166 పరుగులు జోడించాడు. మరోవైపు అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన యశస్వి 40 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 70 పరుగులు చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రియాన్ పరాగ్ 15 బంతుల్లోనే 32 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో రాజస్థాన్ అలవోక విజయం సాధించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 209 పరుగుల భారీ స్కోరును సాధించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 50 బంతుల్లోనే 84 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్ (39), జోస్ బట్లర్ 50 (నాటౌట్) కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News