Tuesday, December 24, 2024

అంచనాలకు మించి రాణించిన రాజస్థాన్ రాయల్స్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/క్రీడా విభాగం : ఐపిఎల్‌లో టైటిల్ ఫేవరెట్‌లుగా భావించిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడ ర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లు కనీసం నాకౌట్ దశకు కూడా చేరకుండానే ఇంటిదారి పట్టాయి. ఇక ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఏకంగా ట్రోఫీని సొంతం చేసుకుంది. మరోవైపు లక్నో సూపర్ జె యింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్లేఆఫ్‌కు చేరుకుని సత్తా చాటాయి. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఫైనల్‌కు చేరుకుని టోర్నీలో పెను ప్రకంపనలు సృష్టించింది. లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచిన రాజస్థాన్ ప్లేఆఫ్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేసింది. క్వాలిఫయర్2లో బెంగళూరును ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. తుది పోరులో కూడా చివరి వరకు పోరాడి గుజరాత్ చేతిలో ఓటమి పాలైంది. ఇక ఈ సీజన్‌లో రాజస్థాన్ స్థాయికి మించి ప్రదర్శన చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యంత నిలకడగా రాణించింది. కెప్టెన్ సంజు శాంసన్ జట్టును ముందుండి నడిపించాడు. కీలక ఇన్నింగ్స్‌తో జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషించాడు. ఇతక ఆటగాళ్లు కూడా తమ పాత్రను సక్రమంగా నిర్వర్తించడంతో రాజస్థాన్ ఈ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచింది. చివరి మ్యాచ్‌లో ఓడినా ఆఖరి వరకు గుజరాత్‌కు గట్టి పోటీ ఇచ్చింది.
బట్లర్ వీర విధ్వంసం..
ఇక రాజస్థాన్ రన్నరప్‌గా నిలిచిందంటే దానికి ప్రధాన కారణం ఓపెనర్ జోస్ బట్లర్ హీరోచిత బ్యాటింగే కారణం అని చెప్పాలి. ఈ సీజన్‌లో బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అంతేగాక కీలక మ్యాచుల్లో శతకాలతో కదంతొక్కాడు. అతని బ్యాటింగ్ తీరును ఎంత పొగిడినా తక్కువే. ఈ సీజన్‌లో బట్లర్ ఏకంగా నాలుగు శతకాలు బాదేశాడు. 17 మ్యాచుల్లో ఏకంగా 863 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. క్వాలిఫయర్2లో బట్లర్ సాధించిన సెంచరీ ఐపిఎల్‌లోని అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా చిరకాలం గుర్తుండి పోవడం ఖాయం. మరోవైపు కెప్టెన్ సంజు శాంసన్ కూడా 458 పరుగులు చేసి సత్తా చాటాడు. రాజస్థాన్ విజయాల్లో అతని పాత్ర కూడా చాలా కీలకమని చెప్పాలి. మరోవైపు బౌలింగ్‌లో కూడా రాజస్థాన్ ఆటగాళ్లు సత్తా చాటారు. యజువేంద్ర చాహల్ 27 వికెట్లతో పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ కూడా 19 వికెట్లతో రాణించాడు. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప్రతి ఆటగాడు తనవంతు పాత్రను సమర్థంగా పోషించడంతో రాజస్థాన్ ఈ సీజన్‌లో రన్నరప్ ట్రోఫీని దక్కించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News