Sunday, December 22, 2024

నేడు రాజస్థాన్‌తో లక్నో తొలి పోరు

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్‌లో భాగంగా ఆదివారం జరిగే మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. దీంతో రెండు జట్లు కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేయాలనే పట్టుదలతో ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రెండు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు రెండు జట్లలోనూ కొదవలేదు. రాజస్థాన్‌కు సంజు శాంసన్, లక్నోకు కెఎల్ రాహుల్ సారథ్యం వహిస్తున్నారు. కిందటి సీజన్‌లో ఇరు జట్లు కూడా మెరుగైన ప్రదర్శన చేశాయి. ఈసారి మాత్రం టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి. సొంత గడ్డపై మ్యాచ్ జరుగుతుండడం రాజస్థాన్‌కు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. కెప్టెన్ శాంసన్, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, షిమ్రోన్ హెట్‌మెయిర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్ తదితరులతో రాజస్థాన్ బ్యాటింగ్‌చాలా బలంగా ఉంది.

అంతేగాక అశ్విన్, యజువేంద్ర చాహల్, అవేశ్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, రొమన్ పొవెల్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో జట్టు ఆశలన్నీ యశస్వి జైస్వాల్, బట్లర్, జురెల్, శాంసన్‌లపైనే నిలిచాయి. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో యశస్వి పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే జోరును కనబరచాలనే పట్టుదలతో ఉన్నాడు. హెట్‌మెయిర్, బట్లర్, శాంసన్ రూపంలో విధ్వంసక బ్యాటర్లు జట్టులో ఉన్న విషయం తెలిసిందే. దీంతో రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు లక్నోలో కూడా స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బౌలర్లు, బ్యాటర్లు జట్టులో ఉన్నారు. కెప్టెన్ కెఎల్ రాహుల్‌పై జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత నెలకొంది. రాహుల్‌తో పాటు క్వింటన్ డికాక్, దేవ్‌దుత్ పడిక్కల్, నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్య వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు.

డికాక్, రాహుల్, పూరన్, స్టోయినిస్, పడిక్కల్‌లకు ఐపిఎల్‌లో కళ్లు చెదిరే రికార్డు ఉండడం కూడా జట్టుకు కలిసివచ్చే అంశంగా చెప్పాలి. మరోవైపు అమిత్ మిశ్రా, రవి బిష్ణోయ్, నవీనుల్ హక్, షమర్ జోసెఫ్, డేవిడ్ విల్లీ, కృనాల్ తదితరులతో బౌలింగ్ విభాగం కూడా బాగానే కనిపిస్తోంది. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయమనే చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News