రాహుల్, మయాంక్ శ్రమ వృథా, పంజాబ్ అనూహ్య ఓటమి
దుబాయి: ఐపిఎల్ రెండో దశ టోర్నీలో రాజస్థాన్ సంచలన విజయం సాధించింది. మంగళవారం చివరి బంతి వరకు నువ్వానేనా అన్నట్టు సాగిన హోరాహోరీ మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. ఇక చివరి ఓవర్ వరకు మ్యాచ్‌ను శాసించిన పంజాబ్ అనూహ్య ఓటమి చవిచూడగా రాజస్థాన్ చిరస్మరణీయ గెలుపును తన ఖాతాలో వేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. తర్వాత భారీ లక్షంతో బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 183 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. చివరి ఓవర్‌లో విజయం కోసం పంజాబ్‌కు 4 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. కానీ కార్తీక్ త్యాగి ఆఖరి ఓవర్‌లో మాయ చేశాడు. అసాధారణ బౌలింగ్‌తో చెలరేగి పోయిన కార్తీక్ పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా కీలకమైన రెండు వికెట్లు తీసి రాజస్థాన్‌కు అద్భుత విజయం అందించాడు. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కెఎల్.రాహుల్ శుభారంభం అందించారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించారు.
ఆరంభంలో రాహుల్ దూకుడును ప్రదర్శించాడు. ఆ తర్వాత మయాంక్ తన మార్క్ షాట్లతో చెలరేగి పోయాడు. దూకుడుగా ఆడిన మయాంక్ 43 బంతుల్లోనే రెండు సిక్స్‌లు, మరో ఏడు ఫోర్లతో 67 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ 4 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 49 పరుగులు సాధించాడు. ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 120 పరుగులు జోడించారు. తర్వాత వచ్చిన ఐడెన్ మార్‌క్రామ్ 26 (నాటౌట్), నికోలస్ పూరన్ (32) రాణించినా జట్టును గెలిపించ లేక పోయారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌కు కూడా ఓపెనర్లు లూయిస్ (36), యశస్వి జైస్వాల్ (49) శుభారంభం అందించారు. ఇద్దరు తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించారు. మరోవైపు మహిపాల్ 17 బంతుల్లోనే 4 భారీ సిక్సర్లు, రెండు సిక్సర్లతో 43 పరుగులు సాధించాడు. కానీ చివర్లో పంజాబ్ బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు తీయడంతో రాజస్థాన్ స్కోరు 185 పరుగులకే పరిమితమైంది. ఆర్ష్‌దీప్ సింగ్ ఐదు, షమి మూడు వికెట్లు పడగొట్టారు.