జైపూర్: రాజస్థాన్ విద్యార్థులు ప్రపంచ రికార్డును సృష్టించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి పైగా విద్యార్థులు ఏకకాలంలో దేశభక్తి గీతాలు ఆలపించి ప్రపంచ రికార్డును సాధించారు. ఈ ఘనతను సాధించిన విద్యార్థులను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అభినందించారు. శుక్రవారం సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో విద్యార్థులనుద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ కోటి మంది విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గీతాలను విన్న లండన్‌లోని ప్రతిష్టాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ రాష్ట్ర ప్రభుత్వానికి సర్టిఫికెట్ అందచేసిందని వెల్లడించారు. ప్రపంచ రికార్డు సాధించడానికి కోటి మంది విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా 25 నిమిషాల పాటు వందే మాతరం, సారే జహాసే అచ్చా తదితర దేశభక్తీ గీతాలను ఆలపించారు. నేటి తరం యువత సహోదరభావాన్ని పెంపొందించుకోవాలని ఆయన కోరారు. అభివృద్ధి పథంలో రాష్ట్రం ముందడుగు వేయాలన్నదే తన ఆశయమని ఆయన తెలిపారు. అంతర్జాతీయ యువజనోత్సవం సందర్భంగా యువతకు ఆయన శుభాకాంక్షలు తెలియచేశారు.
దేశభక్తి గీతాలతో రాజస్థాన్ విద్యార్థుల ప్రపంచ రికార్డు
- Advertisement -
- Advertisement -
- Advertisement -