Wednesday, January 22, 2025

రాజస్థాన్‌లో దుశ్శాసన భర్త

- Advertisement -
- Advertisement -

జైపూర్ : రాజస్థాన్‌లో 21 ఏండ్ల గిరిజన మహిళను భర్త నగ్నంగా గ్రామంలో ఊరేగించాడు. ప్రతాప్‌గఢ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనను సెల్‌ఫోన్ ద్వారా చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ దారుణంపై ఏడుగురిని అరెస్టు చేశారు. మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారని పోలీసులు శనివారం తెలిపారు. జరిగిన ఘటనలో బాధితురాలి భర్తను ముందుగా అరెస్టు చేసినట్లు, విచారిస్తున్నట్లు జిల్లా ఎస్‌పి అమిత్ కుమార్ వివరించారు. ధారియావాద్‌లో భార్యను బలవంతంగా భర్త మోటారుసైకిల్‌పై తీసుకువెళ్లి, తరువాత ఇతరులు ఆమెను కొడుతూ ఉండగా వివస్త్రను చేసినట్లు, తరువాత నగ్నంగా ఊరేగించాడు. గ్రామస్తుల ఎదుటనే ఆమె బట్టలూడదీయడం, ఇతరులతో కలిసి భార్యను చితకబాదడం వంటి దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. పది మంది పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నట్లు ఎస్‌పి తెలిపారు. వీరిలో ఇప్పటికైతే ప్రధాన నిందితుడితో పాటు ఎనమండుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. తనకు జరిగిన దారుణంపై బాధితురాలు భర్త కన్హా గమెటీపై ఫిర్యాదు చేసింది. ఇందులో ఇతరుల పేర్లను కూడా పొందుపర్చింది.

మరో వ్యక్తితో ఈ యువతి అక్రమ సంబంధం పెట్టుకుందని తెలియడంతో భర్త ఈ విధంగా వ్యవహరించినట్లు ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైనట్లు స్థానిక పోలీసు అధికారి తెలిపారు. కాగా ఈ యువతిని అత్తింటివారు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. ఇంట్లో బందీగా ఉంచారు. అక్కడనే ఈ దారుణం జరిగింది. జరిగిన ఘటనపై రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందించాయి. మహిళకు భద్రత లేదని బిజెపి విమర్శించింది. రెడ్ డైరీ నిజమైందని వ్యాఖ్యానించింది. కాగా ఈ విషయంలో పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని పోలీసు అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ ఆదేశించారు. ఐజి, ఎస్‌పిల పర్యవేక్షణలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసినట్లు డిజిపి మిశ్రా తెలిపారు. సిఎం గెహ్లోట్ ధరియావాద్ గ్రామానికి వెళ్లి బాధితురాలిని పరామర్శిస్తారని అధికారులు తెలిపారు. ఓ వైపు సోషల్ మీడియా ద్వారా ఈ దారుణం గురించి వీడియోలు వెలువడ్డా, దీనిపై పోలీసులకు ఎటువంటి సమాచారం లేదని, ఇదీ ఇక్కడి పరిస్థితి అని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి , బిజెపి నాయకురాలు వసుంధరారాజే స్పందించారు. గర్భవతిని ఈ విధంగా దారుణంగా హింసించారని తెలిపారు. బాధితురాలికి వెంటనే ఆర్థిక సాయం అందేలా చూడాలని రాజస్థాన్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అధికారులను ఆదేశించింది.

ప్రభుత్వం సరిగ్గా స్పందించింది ః ప్రియాంక
రాజస్థాన్‌లో మహిళపై అమానుష ఘటన విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గానే స్పందించిందని పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ తెలిపారు. ఘటన గురించి తెలియగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగు ఆదేశాలు వెలువడ్డాయి. క్రిమినల్స్ అరెస్టు జరిగింది. సంబంధిత దోషులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించి తగు శిక్ష విధిస్తారని తెలిపారు. ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాల్సి ఉంటుంది. ఇదే దశలో ఇటువంటివి జరిగినప్పుడు అధికార యంత్రాంగం వెంటనే చర్యలకు దిగడం కీలకమవుతుంది. లేకపోతే దారుణాలకు అంతులేకుండా పోతుందని తెలిపిన ప్రియాంక రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో సరిగ్గా వ్యవహరించినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News