Friday, December 20, 2024

రాజస్థాన్ జయకేతనం

- Advertisement -
- Advertisement -

Rajasthan won match by six wickets against Punjab Kings

బట్లర్ మెరుపులు, ఆదుకున్న జైస్వాల్, చాహల్ మ్యాజిక్, పంజాబ్‌పై రాయల్స్ గెలుపు

ముంబై: ఐపిఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఊరట విజయం లభించింది. శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఆరు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ విజయంతో రాజస్థాన్ ప్లేఆఫ్‌కు మరింత చేరువైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన రాజస్థాన్ 19.4 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.

బట్లర్ జోరు..

క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్‌కు ఓపెనర్లు జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ శుభారంభం అందించారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. బట్లర్ తన ఫామ్‌ను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. ఆరంభం నుంచే ధాటిగా ఆడుతూ స్కోరును పరిగెత్తించాడు. తన మార్క్ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించాడు. అయితే 16 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌తో 30 పరుగులు చేసిన బట్లర్‌ను రబడా ఔట్ చేశాడు. దీంతో 46 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.

రాణించిన యశస్వి..

బట్లర్ ఔటైన తర్వాత ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ తనపై వేసుకున్నాడు. అతనికి కెప్టెన్ సంజు శాంసన్ అండగా నిలిచాడు. ఇద్దరు కలిసి స్కోరును ముందుకు నడిపించారు. శాంసన్ దూకుడైన బ్యాటింగ్‌తో అలరించాడు. 12 బంతుల్లోనే 4 ఫోర్లతో 23 పరుగులు చేశాడు. అయితే జోరు మీద కనిపించిన శాంసన్‌ను రిషి ధావన్ వెనక్కి పంపాడు. మరోవైపు యశస్వి సమన్వయంతో ఆడుతూ జట్టును లక్షం వైపు నడిపించాడు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ స్కోరు వేగం తగ్గకుండా చూశాడు. అతనికి దేవ్‌దుత్ పడిక్కల్ తనవంతు సహకారం అందించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన యశస్వి 41 బంతుల్లోనే 9 ఫోర్లు, రెండు సిక్సర్లతో 68 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఆత్మరక్షణతో బ్యాటింగ్ చేసిన పడిక్కల్ 3 ఫోర్లతో 31 పరుగులు చేశాడు. కాగా, హెట్‌మెయిర్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో రాజస్థాన్‌ను ఆదుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగిన హెట్‌మెయిర్ 16 బంతుల్లోనే రెండు సిక్సర్లు, మరో మూడు బౌండరీలతో 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో రాజస్థాన్ మరో రెండు బంతులు మిగిలివుండగానే విజయాన్ని అందుకుంది.

ఆదుకున్న బెయిర్‌స్టో..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ను ఓపెనర్ జానీ బెయిర్‌స్టో ఆదుకున్నాడు. రాజస్థాన్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముదుకు తీసుకెళ్లాడు. ఆరంభం నుంచే బెయిర్‌స్టో దూకుడును ప్రదర్శించాడు. ఇక ఫామ్‌లో ఉన్న మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ఈసారి నిరాశ పరిచాడు. 16 బంతుల్లో కేవలం 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రాజపక్స ధాటిగా ఆడాడు. రెండు ఫోర్లు, మరో 2 సిక్సర్లతో 27 పరుగులు చేసి వెనుదిరిగాడు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (15) మరోసారి నిరాశ పరిచాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన బెయిర్‌స్టో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో 56 పరుగులు చేశాడు. చివర్లో వికెట్ కీపర్ జీతేశ్ శర్మ 38 (నాటౌట్), లివింగ్‌స్టోన్ (22) ధాటిగా ఆడడంతో పంజాబ్ స్కోరు 189 పరుగులకు చేరింది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ మూడు వికెట్లతో రాణించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News