హైదరాబాద్: ఎస్ఆర్ఎస్పీ, కడెం, కాళేశ్వరం ప్రాజెక్టులు, భద్రాచలంకు వాటిల్లిన ముప్పు, భద్రతా అంశాలపై జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జలవనరుల శాఖలో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగం ఏర్పాటు చేసి కడెం ప్రాజెక్టుకు ఇటీవలే మరమ్మతులు చేశాం కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. గడిచిన వందేళ్లలో కురియని విధంగా కడెం ప్రాజెక్టు ఎగువ పరివాహక ప్రాంతం ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు మండలాల్లో 300 మి. మీ భారీ వర్షం కురిసిందని పేర్కొన్నారు. వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా క్లౌడ్ బర్స్ట్ లాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. వరదలు, వర్షాలపై ప్రభుత్వం సంసిద్ధంగా లేదనడం సరికాదు. వరద నష్టం అంచనాలపై మీడియాలో వస్తున్న కథనాలు నిరాధారమని రజత్ కుమార్ వివరించారు.
కొంతమంది చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్న ఆయన కేంద్రంలోని సీడబ్ల్యూసీలోని 18 విభాగాల అనుమతి తరువాతనే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డేటా యూరోపియన్ శాటిలైట్ ఏజెన్సీల నుంచి కూడా వర్షపాతం తీవ్రతపై సరైన సమాచారం అందలేదు. అవి కూడా పరిస్థితిని కచ్చితంగా అంచనా వేయలేకపోయాయి. పోలవరం లక్ష ఎకరాల వరకు మునిగిపోతాయు. బ్యాక్ వాటర్ వల్ల పంట నష్టంతో పాటు చారిత్రాత్మక ప్రాంతాలకు ముప్పు వాటిల్లుతుంది. భద్రాచలం, పర్ణశాల వంటివి మునిగిపోతాయి. పోలవరం బ్యాక్ విషయంలో స్టడీ చేసేందు కోసం కేంద్రానికి ఎన్నోసార్లు లేఖలు రాసి నివేదించాము. బ్యాక్ వాటర్ నష్టం, ఇతరత్రా అంశాలపై కేంద్రం ఇప్పటికి స్పందించ లేదని చెప్పారు. భారీ వరదల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టుకు సుమారు రూ. 20 నుంచి 25 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందన్నారు. అగ్రిమెంట్లో పేర్కొన్న విధంగా ఆ నష్టాన్ని నిర్వహణా సంస్థలే భరిస్తాయని చెప్పుకొచ్చారు. ప్రభుత్వానికి సంబందం లేదు. 45 రోజుల్లో కాళేశ్వరం పంప్ హౌజ్ ల మరమ్మత్తు పనులు పూర్తవుతాయని రజత్ కుమార్ వెల్లడించారు.