Friday, January 10, 2025

సగం నీళ్లు ఇవ్వాల్సిందే

- Advertisement -
- Advertisement -

కృష్ణలో వాటాపై కేంద్ర జలశక్తి కార్యదర్శికి తేల్చిచెప్పిన రజత్ కుమార్

కాల్వల ఆధునీకరణకు రూ.340కోట్లు, ఎఐబిపి పథకాల పనులకు రూ.140కోట్లు అవసరం
ప్రాజెక్టుల డిపిఆర్‌లను వెంటనే ఆమోదించాలి
కేంద్రంతో రజత్ కుమార్ చర్చలు
సానుకూలంగా స్పందించిన కేంద్ర కార్యదర్శి పంకజ్ కుమార్

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జనాభా పెరిగింది. రాష్ట్రంలో తాగునీటితోపాటు సాగునీటి ఆయకట్టు విస్తీర్ణం పెరిగింది. పెరిగిన రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా కృష్ణానదీజలాల్లో సమాన నీటి వాటాలు కల్పించాలి. ఉమ్మడి ఆంధ్రప్ర దేశ్ రాష్ట్రంలో నష్టపోయిన తెలంగాణకు వెంటనే తక్షణ న్యాయం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర నీటి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. గురువారం ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి పంకజ్ కుమార్‌తో రజత్‌కుమార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర నీటిపారుల రంగానికి సంబంధించిన పలు అంశాలపై సుదీర్గంగా చర్చలు జరిపారు. కృష్ణానదీజలాల్లో బచావత్ ట్రిబ్యునల్ జరిపిన నీటికేటాయింపుల్లో తెలంగాణ ప్రాంతానికి అన్యా యం జరిగిందని తెలిపారు. ఉమ్మడి ఏపికి కేటాయించిన 811టిఎంసీల నీటిలో తెలంగాణ ప్రాంతానికి 299టింసిలు, ఆంధ్రాప్రాంతానికి 511టిఎంసీలు కేటాయించారని, దీనివల్ల తెలంగాణ ప్రాంతం తీవ్రంగా నష్టపోయిందని కేంద్రానికి వివరించారు. రాష్ట్ర విభ.జన అనంతరం తొలిఏడాది తాత్కాలికంగా ఈ ప్రాతిపదికన నీటి వినియోగానికి అంగీకారం తెలిపామని, అయితే ఏళ్లతరబడి తాత్కాలిక ఒప్పందం కొనసాగింపు కుదరదని తేల్చిచెప్పారు. కృష్ణానదీజలాల్లో తెలంగాణ, ఏపి మధ్యన సమాన నీటివాటాలు కేటాయించాలని కృష్ణానదీయాజమాన్య బోర్డు సమావేశాల్లో పలు మార్లు రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలు వెల్లడించినట్టు తెలిపారు. నీటివాటాల పంపిణీ తమ పరిధిలోనిది కాదని కృష్ణాబోర్డు చేతులెత్తేసిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో పెరిగిన నీటి అవసరాలకు తగ్గట్టుగా తెలంగాణకు సమాన నీటివాటాలు కేటాయించేందుకు కేంద్రజల్ శక్తి శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు.
వర్షాలు రాకముందే కాల్వల ఆధునీకరణ నిధులు ఇవ్వండి
వర్షాలు రాకమందుగానే ఆయకట్టు ప్రాంతంలో కాల్వల ఆధునీకరణకోసం కేంద్రప్రభుత్వం కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేయాలని రజత్‌కుమార్ కేంద్ర జల్‌శక్తి శాఖకార్యదర్శి పంకజ్ కుమార్‌కు విజ్ణప్తి చేశారు. కాల్వల ఆధునీకరణ పనులకు సంబంధించి రూ. 340కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి వుం దని గుర్తు చేశారు. అదేవిధంగా ఏఐబిపి పథకం కింద ఎంపిక చేసిన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.140కోట్లు రావాల్సివుందన్నారు. ఈ నిధులు కూడా విడుదల చేయాలని కోరారు. వర్షాలు రాకముందుగానే పనులు చేపట్టి పూర్తి చేసేందకు వెంటనే కేంద్రం నుంచి నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని పంకజ్‌కుమార్‌ను కోరారు.
డిపిఆర్‌లకు ఆమోదం తెలంపండి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదుల పరివాహకంగా చేపట్టిన సాగునీటి పధకాలకు సంబంధించిన డిపిఆర్‌లను ఇప్పటికే నీటియాజమాన్యబోర్డులకు సమర్పించామని తెలిపారు. బోర్డులు కూడా వాటిని పరిశీలించి కేంద్ర జలసంఘానికి పంపాయని తెలిపారు. అనుమతి లేని ప్రాజెక్టులకు సంబంధించిన ప్రాజెక్టులకు కూడా కేంద్రం కోరిన విధంగా డిపిఆర్‌లు సమర్పించినట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టుల డిపిఆర్‌లకు ఆమోదముద్ర వేస్తే త్వరిత గతిన పనులు పూర్తి చేసేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. రాష్ట్ర నీటిపారుదల రంగానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. అన్ని అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్‌తోపాటు కేంద్ర జల్‌శక్తిశాఖకు చెందిన పలువులు అధికారులు పాల్గొన్నారు.

Rajat Kumar talks with Centre over Krishna Water

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News