రాష్ట్ర విభజన తర్వాత కృష్ణ నీటి వాటాలపై కుదిరింది తాత్కాలిక ఒప్పందమే
పరీవాహక ప్రాంతం, రాష్ట్ర జనాభా, మంచి నీరు, సాగునీటి అవసరాలను బట్టి తెలంగాణకు 570 టిఎంసిలు కేటాయించాల్సిందే
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌ను కూడా ఇదే కోరాం
అపెక్స్ కౌన్సిల్ భేటీలోనూ ప్రస్తావనకు వచ్చింది
మినిట్స్‌లోనూ రికార్డు అయ్యింది
త్వరలో జరిగే కెఆర్‌ఎంబి భేటీలో మళ్లీ స్పష్టం చేస్తాం
అందుకు ఒకె అంటేనే ఒప్పందానికి అంగీకారం
కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌పై ఇరిగేషన్ ఇంజినీర్లు న్యాయనిపుణులతో నిర్వహించిన జలసౌధ సమావేశంలో ప్రత్యేక కార్యదర్శి రజత్‌కుమార్ స్పష్టీకరణ
మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణానది పరివాహక ప్రాంతం అధికంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి నదీజలాల్లో 570టిఎంసీల నీటి వాటాకోసం కేంద్రాన్ని కోరేందుకు ప్రభుత్వం నివేదిక సిద్ధం చేస్తోంది. నీళ్లు నిధులు నియామకాలే లక్షంగా ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి ఎపిలో జరిగిన అన్యాయాలను సరిదిద్ది న్యాయమైన హక్కులను సాధించుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ సోమవారం నీటిపారుదల శాఖకు చెందిన ఇంజనీర్లు, న్యాయ నిపుణులతో జలసౌధలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కృష్ణా, గోదవరి నదీజలాలకు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం బోర్డుల పరిధిపై విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై ఈ సమావేశంలో చర్చించారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రధాన అంశాలు, తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగేవిధంగా ఉన్న అభ్యంతర కర అంశాలపై ఏవిధంగా అధిగమించాలన్న దానిపై సమగ్రంగా చర్చించారు. కేంద్రం చర్యలను అడ్డుకుని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకొనేందుకు ఏవిధంగా ముందుకెళ్లాలన్న దానిపై నిపుణుల సలహాలు, సూచనలు కోరారు. ఈ సందర్బంగా రజత్ కుమార్ మాట్లాడుతూ బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానదీజలాల పంపిణీలో ఎపికి 811టిఎంసిల నీటిని కేటాయించిందన్నారు.
అయితే రాష్ట్ర పునర్విభజన అనంతరం జరిగిన తొలి సమావేశంలో తెలంగాణ, ఎపి రాష్ట్రాల మధ్యన నీటికేటాయింపుపై తాత్కాలిక ఒప్పందం మాత్రమే కుదిరిందని తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణకు 299టిఎంసిలు ఎపికి 512టిఎంసిలు వినియోగించుకునేలా అంగీకరించినట్టు తెలిపారు. ప్రతిఏటా తాత్కాలిక ప్రాతిపదకగా మాత్రమే ఈ నీటికేటాయింపుల ఒప్పదం కొనసాగుతున్నట్టు వెల్లడించారు. కృష్ణానది పరివాహక ప్రాంతం, తెలంగాణ రాష్ట్ర జనాభా, తాగునీరు, సాగు నీటి అవసరాల తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణకు 570టిఎంసిల నీటి వాటాను కేటాయించాలని జస్టిష్ బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌ను కూడా కోరినట్టు తెలిపారు. అపెక్స్‌కౌన్సిల్ సమావేశంలో కూడా ఇదే అంశం చర్చకు వచ్చిందన్నారు. మినిట్స్‌లో కూడా రికార్డయినట్టు వివరించారు. త్వరలో జరగనున్న కృష్ణారివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి 50శాతం నీటివాటాను ఇవ్వాలని స్పష్టం చేస్తామని, అమేరకు మాత్రమే ఒప్పదం కుదుర్చుకునేందుకు అంగీకారం తెలపాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు రజత్‌కుమార్ వెల్లడించారు.
గెజిట్‌పై సుప్రీంలో సవాల్‌కు నిర్ణయం
కేంద్రం విడుదల చేసిన కృష్ణారివర్ బోర్డు పరిధికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టులో ఛాలేంజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం న్యాయపరమైన అంశాలను అధ్యయనం చేయిస్తున్నట్టు నీటిపారుదల శాఖ స్పెషల్ సిఎస్ రజత్‌కుమార్ తెలిపారు.అంతే కాకుండా సాంకేతిక పరమైన అంశాలపై కూడా పరిశీలన చేస్తున్నట్టు తెలిపారు. కేంద్రం కృష్ణానదీజలాల పంపిణీపై కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని, నీటికేటాయింపులు తేల్చాకే కృష్ణా రివర్ బోర్డు పరిధిని నిర్ణయిస్తూ గెజిట్ నోటిఫికేషన విడుదల చేయాలన్నారు.
ప్రాజెక్టులపై డిపిఆర్‌లు ఇచ్చేందుకు సిద్ధం
తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులపై నిర్మాణంలో ఉన్న,ఇప్పటికే నిర్మాణాలు పూర్తయి ,వినియోగంలో ఉన్న పలు ప్రాజెక్టుల డిపిఆర్‌లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని రజత్ కుమార్ తెలిపారు. డిపిఆర్‌లపై సమగ్ర అధ్యయనం చేసేందుకు నీటిపారుదల శాఖ ఈఎన్‌సి అధ్యక్షతన ప్రత్యేక కమిటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటి సాంకేతిక పరమైన అన్ని అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి డిపిఆర్‌లు సిద్దం చేస్తుందన్నారు. అడ్మినిస్ట్రేషన్ పరమైన అంశాలను కూడా పరిశీలించనున్నట్టు తెలిపారు. కృష్ణా, గోదావరి నదులపైన 2014నాటికే పలు పథకాలు నిర్మాణంలో ఉన్నాయని , తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కొన్ని పథకాలకు రీడిజైన్లు మాత్రమే జరిగాయన్నారు. పాలమూరురంగారెడ్డి పథకం పనులు 75శాతం పైగానే పూర్తయన్నారు. కొవిడ్ ప్రభావం కారణంగా కొన్ని పనుల్లో జాప్యం జరిగిందని తెలిపారు. టెక్నికల్‌గా, లీగల్‌గా అన్ని అంశాలను నిపుణులో చర్చించాకే ఏవిధంగా ముందుకు పోవాలనే అంశంపై ప్రభుత్వం తుదినిర్ణయం తీసుకుంటుందని స్పెషల్ సిఎస్ రజత్ కుమార్ వెల్లడించారు.
Rajath Kumar review on Krishna River Waters