Sunday, January 12, 2025

ఆ తల్లికి మళ్లీ శ్మశానమే దిక్కైంది

- Advertisement -
- Advertisement -

నలుగురు కొడుకులున్నా ఆ తల్లి బాగోగులు ఏఒక్కరూ పట్టించుకోవడం లేదు. బతికుండగానే శ్మశానానికి తరలించి ఆ తల్లికి నరకం చూపిస్తున్నారు. కడుపున కొడుకు పుట్టాలని, కొడుకు పుడితే తమను పున్నామ నరకం నుంచి తప్పిస్తారంటూ వారిని పోషించేందుకు అష్టకష్టాలు పడ్డ ఆ తల్లికి బతికుండగానే నరకం చూపిస్తున్నారు కుమారులు. తమను కంటికి రెప్పలా కాపాడిన ఆ తల్లికి ఏ లోటు రాకుండా చూడాల్సిన కొడుకులు వృద్ధాప్యం పైబడి, కాలు విరిగి తీవ్ర అవస్థలు పడుతుండగా ఆమెను వదిలించుకోవాలనుకుని మరోసారి శ్మశానంలో వదిలి తమ కర్కశత్వాన్ని చాటుకున్నారు. కర్మకాండల కోసం శ్మశానానికి వెళ్లిన వారికి అక్కడి గది లోంచి వృద్ధురాలి మూలుగు వినిపించడంతో గదిలోకి వెళ్లిచూడగా అచేతనాస్థితిలో పడి ఉన్న రాజవ్వ కనిపించింది.

‘ఆకలవుతోంది… ఇంత అన్నం ఉంటే పెట్టండి… కట్టుకునేందుకు చీర లేదు… ఓ పాత చీరె ఉంటే ఇవ్వండి’ అంటూ ఆమె వేడుకోవడం అక్కడున్న వారి హృదయాలను కదిలించింది. ఇక్కడికి నిన్ను ఎవరు తీసుకొచ్చారని పలువురు మహిళలు ఆ వృద్ధురాలిని ప్రశ్నించగా తన కొడుకు శ్రీనివాస్ తీసుకొచ్చి ఇక్కడ వదిలి వెళ్లాడని, తన కోసం ఓ గది అద్దెకు తీసుకుంటానని… గది దొరికే వరకు ఇక్కడే ఉండమని చెప్పి వెళ్లి తిరిగి రాలేదని బదులిచ్చింది. రాత్రి పూట భయమేస్తోందని, నిద్ర పట్టడం లేదని, దెయ్యాలు పిలిచినట్లుగా వినిపిస్తోందని ఆవేదన చెందింది. తమతో వస్తే ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తామని, మరో చోట ఉంచేలా ఏర్పాట్లు చేస్తామని మహిళలు పేర్కొనగా తన కొడుకు వచ్చి తీసుకెళ్తాడంటూ బదులివ్వడంతో, అమాయక తల్లిని ఇలా వదిలిపెట్టేందుకు ఆ కొడుకుకు మనసెలా వచ్చిదంటూ మహిళల కళ్లు చెమర్చాయి.

జగిత్యాల పట్టణంలోని చిలుకవాడకు చెందిన రాజవ్వకు నలుగురు కొడుకులు కాగా అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని వదిలించుకునేందుకు వారు పక్షం రోజుల క్రితం శ్మశానానికి తరలించారు. అయితే శ్మశానంలో కర్మకాండల కోసం వెళ్లిన వారు అక్కడి గదిలో నరకయాతన పడుతున్న రాజవ్వ దీనస్థితిని చూసి చలించి సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దాంతో రాజవ్వను శ్మశానం నుంచి ఆస్పత్రికి తరలించి వైద్యచికిత్సలు చేయించడంతో పాటు ఆర్‌డిఓ ద్వారా కొడుకులకు కౌన్సెలింగ్ ఇప్పించి తల్లిని కొడుకుల వద్దకు చేర్చారు. అయితే ఒక కొడుకు తల్లిని మళ్లీ శ్మశానంలో పడేసి వెళ్లిపోయాడు. వృద్ధాప్యం పైబడి అనారోగ్యంతో బాధపడున్న తల్లిని శ్మశానంలో చేర్చి నరకం చూపిస్తున్న కొడుకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News