మనతెలంగాణ, సిటిబ్యూరోః డ్రగ్స్ విక్రయం కేసులో అరెస్టైన ఎస్సై రాజేందర్‌ను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. సైబరాబాద్ సైబర్ క్రైం ఎస్సైగా పనిచేస్తున్న రాజేంద్ర మహారాష్ట్రలో నిర్వహించిన ఆపరేషన్‌లో డ్రగ్స్ విక్రయించే వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్న 1.700కిలోల డ్రగ్స్‌ను తన ఇంటిలో దాచిపెట్టాడు. దానిని విక్రయించేందుకు యత్నిస్తుండగా హైదరాబాద్ నార్కోటిక్ బ్యూరో పోలీసులు పట్టుకున్నారు.
నిందితుడిని అరెస్టు చేసిన హెచ్‌న్యూ పోలీసులు రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. కూకట్‌పల్లి కోర్టులో హాజరుపర్చిన రాయదుర్గం పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌లో 250 గ్రాములు కన్పించకుండా పోయింది. దానిని ఎవరికి విక్రయించారనే విషయంపై ఆరా తీస్తున్నారు. డ్రగ్స్ ముఠాలతో రాజేంద్రకు ఉన్న సంబంధాలపై విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ కేసులో అరెస్టైన ఎస్సై రాజేంద్రను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు.