హైదరాబాద్: ఈ మధ్యకాలంలో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లలో కొందరి మాటలు తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి. తాజాగా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ని అసభ్యపదజాలంతో దూషించి వివాదంలో చిక్కుకున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న ‘రాబిన్‌హుడ్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో రాజేంద్రప్రసాద్ డేవిడ్ వార్నర్‌ని దూషించారు. దీంతో వార్నర్ అభిమానులంతా ఆయనపై ఫైర్ అయ్యారు.
అయితే ఈ విషయంపై రాజేంద్రప్రసాద్ వివరణ ఇచ్చారు. ఓ వీడియో ద్వారా ఆయన క్షమాపణ చెప్పారు. ‘రాబిన్‌హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో డేవిడ్ వార్నర్ మీద అనుకోకుండా నా నోటి నుంచి ఓ మాట దొర్లింది. అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. ఆ ఫంక్షన్‌కి వచ్చే ముందు మేమంతా కలిసి ఎంతో అల్లరి చేశాము. నితిన్‌ని అతన్ని(వార్నర్) మీరంతా నా పిల్లల్లాంటోళ్లు అని అన్నాను. నేను అతన్ని నువ్వు యాక్టింగ్‌లోకి రా నీ సంగతి చెప్తాను అంటే.. అతను నువ్వు క్రికెట్‌లోకి రా నీ సంగతి చెప్తానని అన్నాడు. ఇలా అంతా కలిసి అల్లరి చేశాము. ఏది ఏమైనా ఐ లవ్ డేవిడ్ వార్నర్, వార్నర్ లవ్స్ అవర్ ఫిలిమ్స్. అయినప్పటికీ.. ఎవరి మనస్సైనా బాధపెట్టి ఉంటే నేను క్షమాపణ కోరుతున్నాను. ఇంకోసారి నా నుంచి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను. కానీ, 28వ తేదీన రాబిన్‌హుడ్ సినిమా మాత్రం అందరు తప్పక చూడండి’ అని రాజేంద్రప్రసాద్ వీడియోలో పేర్కొన్నారు.